
రేషన్ బియ్యం అమ్మి లంచం ఇవ్వాలి..!
● రైతును వేధించిన సీఐ,
ఇద్దరు ఎస్‌ఐలు అరెస్టు
అన్నానగర్: సేలంలో ఓ రైతును రేషన్ బియ్యం అమ్మమని బలవంతం చేసిన కేసులో రూ.15,000 లంచం తీసుకుంటూ ఒక ఇన్‌స్పెక్టర్, ఇద్దరు ఎస్‌ఐలు, ఒక మహిళా రిపోర్టర్‌ను అరెస్టు చేశారు. వివరాలు.. సేలం జిల్లాలోని ఆత్తూర్ ప్రాంతానికి చెందిన శక్తివేల్ అనే రైతును గత నెలలో సేలం ఫుడ్ సప్లై క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ పోలీసులు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నా ఆరోపణలపై అరెస్టు చేశారు. ఇతను తరువాత స్టేషన్ బెయిల్‌పై విడుదలయ్యారు. ఇంతలో, శక్తివేల్ సేలం అవినీతి నిరోధక శాఖకు ఓ ఫిర్యాదు ఇచ్చారు. ఇందులో ‘‘రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో పోలీసులు నన్ను అరెస్టు చేశారు. దీని తర్వాత, నేను రేషన్ బియ్యం అక్రమ రవాణా, అమ్మకం మానేశాను, కానీ ఇన్‌స్పెక్టర్ రామరాజన్. ఎస్‌ఐలు రేషన్ బియ్యం అక్రమ రవాణా, అమ్మకం కోసం నాపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రతి నెలా రూ. 15 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మొదటగా రూ. 15 వేలు ఇవ్వాలని వారు నన్ను అడిగి హింసిస్తున్నారు. మళ్లీ రేషన్ బియ్యం అమ్మడంపై నాకు ఆసక్తి లేదు. వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని ఆయన అన్నారు. దీంతో శనివారం ఉదయం అధికారులు ఇచ్చిన రసాయనం పూసిన రూ.15,000 నగదుతో రైతు శక్తివేల్ సేలం వంతర్ శీలనాయకన్‌పట్టి ప్రాంతానికి వెళ్లి రాజలక్ష్మి రూ.15 వేలు ఇచ్చారు. అక్కడే దాక్కున్న అవినీతి నిరోధక శాఖ పోలీసులు రాజలక్ష్మిని అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద ఇన్‌స్పెక్టర్ రామరాజన్, ఎస్.ఐ. లు శరవణన్, రామకృష్ణనన్‌ను కూడా మరో విజిలెన్స్ బృందం అరెస్టు చేసింది. వారిని కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపే పనిలో ఉన్నారు. ఒకే కార్యాలయంలో నలుగురు అధికారులను అరెస్టు చేయడంతో సేలం సివిల్ సప్‌లై క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో అధికారులే లేకుండా పోవడం గమనార్హం.
రేపు కరూర్ కేసులో తీర్పు
సాక్షి, చైన్నె : కరూర్ తొక్కిసలాట కేసును సీబీఐకు అప్పగించాలా...? లేదా సుప్రీంకోర్టు నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయాలా? లేదా తమిళనాడు పోలీసుల నేతృత్వంలోని సిట్ విచారణను కొనసాగించాలా..? అన్న అంశంపై సోమవారం తీర్పు వెలువడనుంది. రాష్ట్ర ప్రభుత్వ రిట్ పిటిషన్‌లోని లిఖిత పూర్వక అంశాలను పరిశీలించినానంతరం తీర్పును సుప్రీం కోర్టు వెలువరించనుంది. కరూర్ ఘటనను హైకోర్టు ఆదేశాలతో ఐజీ అష్రాకార్గ్ నేతృత్వంలోని సిట్ బృందం విచారిస్తున్న విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ టీవీకే నేత విజయ్‌తో పాటూ పలువురు దాఖలు చేసుకున్న అప్పీలు పిటిషన్‌పై శుక్రవారం సుప్రీం కోర్టులో వాడీవేడిగా వాదనలు జరిగాయి. విచారణను ముగించిన సుప్రీంకోర్టు బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిని కోర్టు పరిగణించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రిట్ పిటిషన్ లిఖిత పూర్వకంగా సుప్రీంకోర్టుకు సమర్పించినట్టు సమాచారం. దీంతో ఈ కేసులో తీర్పును సోమవారం ప్రకటించేందుకు సుప్రీం కోర్టు నిర్ణయించడం గమనార్హం. కేసును సీబీఐ విచారించేనా, సుప్రీం కోర్టు పర్యవేక్షణలో కొత్త సిట్ విచారించేనా, ప్రస్తుత సిట్ విచారణ కొనసాగేనా అనేది వేచిచూడాల్సిందే. అదే సమయంలో ఐజీ అష్రాకార్గ్ నేతృత్వంలోని సిట్ విచారణ మరింత వేగంపుంజుకుంది. అన్ని కోణాలలో విచారణను ముగించిన ఈ బృందం, టీవీకే వర్గాల వద్ద సమాచారాలను రాబట్టే దిశగా విచారణ సాగిస్తోంది.
చైన్నెలో కులాల పేరిట 3,400 వీధులు
సాక్షి, చైన్నె : రాజధాని నగరం చైన్నెలో 3,400 వీధుల పేర్లలో కులాలు ఉన్నట్టు వెలుగు చూసింది. ఈనెల 19వ తేదీ నాటికి ఈ పేర్లను మార్చేందుకు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం దిశగా ప్రభుత్వం కొత్త బాటను ఎంచుకున్న విషయం తెలిసిందే. కులాలు, మతాలను సూచించే విధంగా ఉన్న గ్రామాలు, వీధులు,రోడ్లు, తదితర వాటి పేర్ల మార్పునకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయా జిల్లాల వారీగా పేర్ల మార్పునకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాజధాని నగరం చైన్నెలో 3,400 వీధులకు కులాల పేర్లు ఉన్నట్టు పరిశీలనలో తేలింది. వన్నియర్, నాయర్, మొదలియార్, రెడ్డి అన్న పేర్లతో ఉన్న ఈ వీధులకు కొత్త పేర్లు సూచించనున్నారు. పేర్ల వెనుక ఉన్న కులాన్ని తొలగించడం లేదా, కొత్తగా పుష్పాలు లేదా చరిత్రను సూచించే చిహ్నాల పేర్లను పెట్టే విధంగా కసరత్తు జరుగుతోంది. ఈ ప్రక్రియను ఈనెల 19వ తేదీలోపు పూర్తి చేయడానికి అధికారులు ఉరకలు తీస్తున్నారు.