
రాష్ట్ర పర్యటనకు నైనార్
సాక్షి, చైన్నె: బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు. మదురై వేదికగా ఆదివారం శ్రీకారం చుట్టనున్నారు. ఈ యాత్రను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించనున్నారు. వివరాలు.. తమిళనాడులో పాగా వేయాలనే లక్ష్యంతో వ్యూహాలకు బీజేపీ పదును పెట్టిన విషయం తెలిసిందే.అన్నాడీఎంకేతో కలిసి ఎన్నికలనుఎదుర్కొనేందుకు సిద్దమైన బీజేపీ నేతలు తమ వంతుగా బలాన్ని చాటేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ప్రజా చైతన్యయాత్ర రూపంలో తన బలాన్ని చాటుకుంటూ వస్తున్నారు.ఈ పరిస్థితులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సైతం ప్రచార యాత్రకు సిద్ధమయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినానంతరం ఆయన ప్రపథమంగా రాష్ట్రపర్యటన చేపట్టనున్నారు. దక్షిణ తమిళనాడులో తన బలాన్ని చాటడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపే విధంగా పర్యటనకు కార్యచరణ సిద్ధం చేసుకున్నారు. గతంలో పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన అన్నామలై చేపట్టిన యాత్రలు, కార్యక్రమాలు బిజేపీలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. తాజాగా ఆ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసే దిశగా తన పర్యటన ఉంటుందన్న ధీమాను నైనార్ వ్యక్తం చేస్తున్నారు.
మదురై నుంచిశ్రీకారం
దక్షిణ తమిళానాడులో ప్రధాన కేంద్రంగా, ఆథ్యాత్మిక నగరంగా ఉన్న మదురై నుంచి తన ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు నైనార్ ఏర్పాట్లు చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు మదురై అన్నానగర్‌లో జరిగే సభతో ప్రచారం మొదలు కానున్నది. ఈ ప్రచార యాత్రను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి ఎల్. మురుగన్ ప్రారంభించనున్నారు. జిల్లాల వారీగా ప్రధాన అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ నైనార్ పర్యటనకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈమేరకు 13న శివగంగై,14న చెంగల్పట్టు, 15 ఉత్తర చైన్నె, 16న సెంట్రల్‌చైన్నె, 24వతేదిన పెరంబలూరు, అరియలూరు,25న తంజావూరు, 27న తిరుచ్చి, 28న దిండుగల్, 29 నామక్కల్‌లలో పర్యటించనున్నారు. నవంబర్ 3వ తేదిన ఈరోడ్ దక్షిణం, 4వ తేదిన కోయంబత్తూరు ఉత్తరం, 6న తిరుప్పూర్ ఉత్తరం, 8న ధర్మపురి దక్షిణం, 12న పుదుకోట్టై, 13న రామనాథపురం తూర్పు, 17న తిరునల్వేలి ఉత్తరం, 18న కన్యాకుమారి పశ్చిమం, 19న కన్యాకుమారి తూర్పు, 20న తెన్కాసి, 21న తిరునల్వేలి దక్షిణం, 22న తూత్తకుడి దక్షిణంలో నైనార్ పర్యటన జరగనున్నది. నవంబర నెలాఖరు వరకు తొలివిడత పర్యటన, డిసెంబరులో రెండు, మూడో విడత పర్యటనలకు రూట్ మ్యాప్ సిద్ధంచేశారు.అయితే, ప్రచార సభల రూపంలోనే యాత్ర సాగించాల్సిన పరిస్థితి. రోడ్ షోలోకు అనుమతిని హైకోర్టు ఇప్పటికే నిషేధం విధించింది. అలాగే రహదారులు, జాతీయ రహదారులలో సభలకు సైతం అనుమతి రద్దు చేసి ఉండడంతో ఆయా ప్రాంతాలో మైదానాలను వేదికగా ఎంపిక చేసుకునేదిశగా బీజేపీ వర్గాలుముందుకెళ్తున్నాయి. కాగా, కొన్ని కీలక అసెంబ్లీ నియోజకవర్గాలను గురి పెట్టి నైనార్ యాత్ర సాగనున్నడం గమనార్హం. ఈ నియోజకవర్గాలలో అన్నాడీఎంకే బలం సైతం అధికంగా ఉండటం ఆలోచించ దగ్గ విషయం. తాము పోటీచేసే అసెంబ్లీ నియోజకవర్గాలను గురి పెట్టి నైనార్ యాత్రకు కార్యాచరణను బీజేపీ సిద్ధం చేసినట్టుగా చర్చ ఊపందుకుంది.