డిప్యూటీ సీఎం ఉదయనిధికి విశ్రాంతి
సాక్షి, చైన్నె: డీఎంకే యువజన నేత, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నారు. ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో కొద్దిరోజులు ఆయన విశ్రాంతి తీసుకోనున్నారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వారం పది రోజులకు పైగా తిరుచ్చి, పుదుకోట్టై తదితర జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. సంక్షేమ కార్యక్రమాల పంపిణీతో పాటుగా డీఎంకే యువజన సమావేశాలలో బిజీ అయ్యారు. ఆదివారం మదురైలో జరిగిన డీఎంకే సర్వసభ్య సమావేశానికి సైతం హాజరయ్యారు. ఈ పరిస్థితులో సోమవారం ఆయన తీవ్ర జ్వరం, దగ్గుతో బాధ పడుతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. వైద్యులను సంప్రదించినానంతరం ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కొద్ది రోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకోనున్న దృష్ట్యా, డిప్యూటీ సీఎంకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు వాయిదా పడినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
తిరుత్తణి ఆలయంలో చంటి బిడ్డలకు పాలు
తిరుత్తణి: పట్టణంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో చంటి బిడ్డలకు వేడిపాలు పంపిణీ పథకాన్ని ఆర్డీఓ కణిమొళి సోమవారం ప్రారంభించారు. తమిళనాడులోని హిందుదేవాయశాఖ ఆధ్వర్యంలో 10 ఆలయాల్లో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల చంటి పిల్లలు ఐదేళ్లు లోపు వారికి వేడిపాలు పంపిణీ చేయాలని అసెంబ్లీలో సీఎం స్టాలిన్ ప్రకటించారు. దీంతో తిరుచ్చందూరులోని మురుగన్ ఆలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో హిందుదేవాదాయ శాఖ మంత్రి శేఖర్‌బాబు పాల్గొని, చంటిపిల్లలకు వేడిపాలు పంపిణీ ప్రారంభించారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలోని ఆర్సీ మండపంలో నిర్వహించిన కార్యక్రమానికి జాయింట్ కమిషనర్ రమణి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ఆర్డీఓ కలైసెల్వి పాల్గొని, చంటి పిల్లలకు వేడిపాలు అందజేశారు. సహాయ కమిషనర్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
బ్రెయిన్‌డెడ్ యువకుడి అవయవాల దానం
వేలూరు: వేలూరు సమీపంలోని అరపాక్కం గ్రామ పంచాయతీ పరిధిలోని శివరాజపురం గ్రామానికి చెందిన రా జ్‌కుమార్ కుమారుడు సురేందర్(23). ఇతను వేలూరులోని ఊరీస్ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో గత నెల 31వ తేదీన సాయంత్రం పుత్తుకాడు–మేలంకుప్పం రోడ్డులో జరిగిన బైకు ప్రమాదంలో సురేందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి రాణిపేట సీఎంసీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో వైద్యులు చికిత్స చేసినప్పటికీ ఆదివారం రాత్రి సురేందర్‌కు బ్రెయిన్‌డెడ్ అయింది. దీంతో డాక్టర్ల సలహాల మేరకు అతని అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. దీంతో అతని అవయవాలను చైన్నె అపోలో ఆసుపత్రి, రాణిపేట సీఎంసీ ఆసుపత్రి, చైన్నెలోని ప్రైవేటు ఆసుపత్రి, కళ్లు వేలూరులోని సీఎంసి కంటి ఆసుపత్రికికి దానంగా అందజేసినట్లు వేలూరు సీఎంసీ ఆసుపత్రి పీఆర్‌ఓ దురై జాస్పర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు
తిరువళ్లూరు: డీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దామని రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి నాజర్ స్పష్టం చేశారు. తిరువళ్లూరు జిల్లా ఆవడిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు పంపిణీ కార్యక్రమం కలెక్టర్ ప్రతాప్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి నాజర్ హాజరై, ఉపకరణాలను అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి నాజర్ మాట్లాడుతూ 2025–26 విద్యా సంవత్సరానికిగాను జిల్లాలోని 984 ప్రాథమిక పాఠశాలలు, 257 అప్పర్ ప్రైమరీ పాఠశాలలు, 130 హైస్కూళ్లు, 119 హయ్యర్ సెకండరీ పాఠశాలలు మొత్తం 1,490 పాఠశాలల్లో 1,91,950 మంది విద్యార్థులకు విద్యా ఉపకరణాలను అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఉధయకుమార్, సిఇఓతో పాటు పలువురు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం ఉదయనిధికి విశ్రాంతి
డిప్యూటీ సీఎం ఉదయనిధికి విశ్రాంతి
డిప్యూటీ సీఎం ఉదయనిధికి విశ్రాంతి


