డీఎంకే మేనిఫెస్టోలోని కీలక అంశాలు ఇవే..

- - Sakshi

సాక్షి, చైన్నె: సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో క్లీన్‌ స్వీపే లక్ష్యంగా డీఎంకే మెగా కూటమి వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. మిత్రపక్షాలకు పుదుచ్చేరితో పాటు తమిళనాడులోని 19 స్థానాలను అధికార డీఎంకే కేటాయించింది. మిగిలిన 21 స్థానాలలో తమ అభ్యర్థులను రంగంలోకి దించింది. ఇందులో భాగంగా బుధవారం తేనాంపేటలోని డీఎంకే కార్యాలయం అన్నా అరివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థుల జాబితాను సీఎం స్టాలిన్‌ ప్రకటించారు.

డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎంపీ కనిమొళి నేతృత్వంలోని కమిటీ రూపొందించిన మేనిఫెస్టోలోని అంశాలను స్టాలిన్‌ మీడియాకు వివరించారు. ఎన్నికల ముందు ఇచ్చే వాగ్దానాలే కాదు. అధికారంలోకి వచ్చినానంతరం ఇవ్వని వాగ్దానాలనూ కూడా అమలు చేసిన ఘనత ద్రవిడ మోడల్‌ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం తథ్యమని, దీనిని దృష్టిలో ఉంచుకునే తమ మేనిఫెస్టోను రాష్ట్ర, జాతీయ స్థాయి అంశాలతో రూపొందించామని వివరించారు. మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్నీ అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.

మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు
● రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించే విధంగా చట్ట సవరణకు తొలి ప్రాధాన్యత.

● అనవసరంగా ఉన్న గవర్నర్‌ పదవి వ్యవహారంలో మార్పులు, సీఎం సలహాలను తప్పని సరిగా స్వీకరించాలనే నిబంధన రూపకల్పనకు కృషి. గవర్నర్‌కు ప్రత్యేక అధికారులు కల్పించే సెక్షన్‌ 361 రద్దు.

● చైన్నెలో సుప్రీంకోర్టు శాఖ ఏర్పాటు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పనకు ప్రణాళిక.

● కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పోటీ పరీక్షలన్నీ తమిళంతో పాటు ఇతర ప్రాంతీయ భాషలలో నిర్వహణ. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో తమిళం తప్పనిసరి. అన్ని భాషల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు. జాతీయ గ్రంథంగా తిరుక్కురల్‌ ప్రకటన.

● శ్రీలంక నుంచి తమిళనాడులోకి వచ్చి స్థిరపడ్డ తమిళులకు భారత పౌరసత్వం కేటాయింపు.

● రైల్వే శాఖకు ప్రత్యేక బడ్జెట్‌, చైన్నెలో మూడవ అతిపెద్ద రైల్వే టెర్మినల్‌ ఏర్పాటు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ తక్షణం అమలు. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ బడులలో అల్పాహార పథకం అమలు చేసేందుకు చర్యలు.

● దేశవ్యాప్తంగా గృహిణులకు నెలకు రూ. 1000 నగదు పంపిణీ పథకం అమలు.

● నీట్‌ నుంచి తమిళనాడుకు మినహాయింపు. అన్ని రాష్ట్రాలలో సీఎంల నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి మండలి ఏర్పాటు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 10 లక్షలు వడ్డీ లేని రుణం పంపిణీ.

● బీజేపీ తీసుకొచ్చిన కొన్ని అసంబద్ధ కార్మిక చట్టాలు, ఇతర చట్టాలు, పథకాలు రద్దు, మరికొన్నింటిపై పునర్‌ సమీక్ష. జమిలీ ఎన్నికల రద్దు. జాతీయ రహదారులలో టోల్‌గేట్ల ఎత్తివేత. బ్యాంక్‌లలో కనీస నగదు నిల్వ నిబంధన ఎత్తివేత. సీఏఏ చట్టం రద్దు. దేశవ్యాప్తంగా కులగణన. రైతులకు మద్దతు ధర కల్పన, దేశవ్యాప్తంగా విద్యార్థుల విద్యారుణాల రద్దు. కొత్తగా రూ. 4 లక్షలు రుణాల పంపిణీ. తమిళనాడులో జాతీయ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటు. విమాన చార్జీల క్రమబద్ధీకరణ.

● ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 500, లీటరు పెట్రోల్‌ రూ. 75, లీటరు డీజిల్‌ ధర రూ. 65గా నిర్ణయం. ఉపాధి హామీ పథకం 100 రోజుల నుంచి 150 రోజులకు పెంపు. రోజు వారీ కూలి రూ. 400కు పెంపు.

21 మంది అభ్యర్థుల ప్రకటన
మేనిఫెస్టో విడుదల తర్వాత తమ పార్టీ పోటీ చేసే స్థానాలలో 21 మంది అభ్యర్థుల జాబితాను స్టాలిన్‌ ప్రకటించారు. ఇందులో 10 మంది సిట్టింగ్‌ ఎంపీలకు మళ్లీ అవకాశం కల్పించారు. మరో 11 మంది కొత్త వారికి ఛాన్స్‌ ఇచ్చారు. అయితే సిట్టింగ్‌ ఎంపీలలో ధర్మపురి సెంథిల్‌కుమార్‌, కళ్లకురిచ్చి సీనియర్‌ నేత పొన్ముడి వారసుడు గౌతం శిఖామణి, సేలం పార్తీబన్‌, తంజావూరు నాలుగు సార్లు గెలిచిన ఎస్‌ఎస్‌ పళణి మాణిక్యం, తెన్‌కాశి ధనుష్‌కుమార్‌, పొల్లాచ్చి షణ్ముగసుందరం తదితరులకు ఈసారి సీటు కేటాయించలేదు.

పొన్ముడి వారసుడిపై కోర్టులలో కేసులు ఉండటం ఓ కారణమైనా, నాలుగు సార్లు గెలిచిన ఎస్‌ఎస్‌ పళణి మాణిక్యంకు సీటు ఇవ్వక పోవడం చర్చనీయాంశంగా మారింది. తంజావూరులో పోటీ చేసే మురసోలి అనే అభ్యర్థి పేరును పలుమార్లు సీఎం వ్యాఖ్యానించడం గమనార్హం. ఈరోడ్‌లో కొత్తగా పోటీ చేస్తున్న కె. ప్రకాష్‌ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ సన్నిహితుడు కాగా, పెరంబలూరులో పోటీ చేయనున్న అరుణ్‌ నెహ్రూ, సీనియర్‌ నేత, మంత్రి కేఎన్‌ నెహ్రూ వారసుడు కావడం గమనార్హం. అలాగే మాజీ మంత్రి సెల్వ గణపతికి ఈసారి సేలం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. కాగా 21 మంది అభ్యర్థుల్లో 19 మంది పట్టభద్రులు, ముగ్గురు మహిళలు ఉండడం గమనార్హం.

Election 2024

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top