● వివాహమైన రెండవ రోజే వరుడి ఆత్మహత్య
తిరువొత్తియూరు: చెంగల్పట్టు సమీపంలో వివాహమైన రెండవ రోజే వరుడు ముహూర్తపు చీరతో ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. కాంచీపురం జిల్లా కచేరి గ్రామానికి చెందిన శరవణన్ (27) ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. చెంగల్పట్టుకు చెందిన బంధువుతో ఈనెల 17న శరవణన్‌కు వివాహం చేశారు. వధూవరులిద్దరూ వీరిద్దరూ చిన్న నాటి నుంచే స్నేహి తులు. ఇక వివాహం అయిన తర్వాత వధూవరులు తిమ్మవరంలోని వధువు ఇంటికి వెళ్లారు. అక్కడ మంగళవారం రాత్రి శోభనం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున వధువు అరుస్తూ.. గదినుంచి పరుగులు తీసింది. వెంటనే ఆమె తల్లిదండ్రులు గదిలోకి వెళ్లి చూడగా అక్కడ వరుడు శరవణన్ వధువు ముహూర్తపు చీరతో ఉరికి వేలాడుతున్నాడు. చెంగల్పట్టు తాలూకా పోలీసులు శరవణన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.


