
పన్నీరు సెల్వం
● పన్నీరు సెల్వం
సాక్షి, చైన్నె : మరికొద్ది రోజుల్లో చిన్నమ్మ శశికళతో భేటీ కానున్నట్లు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం తెలిపారు. అన్నాడీఎంకేను సమష్టిగా కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. అన్నాడీఎంకేను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో పళనిస్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే, ఎలాగైనా పార్టీని తన వశం చేసుకునే దిశగా సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం ఎత్తుకు పైఎత్తు వేస్తున్నారు. అన్నాడీఎంకేలో చీలిక కారణంగా ఆవిర్భవించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్‌తో పన్నీరు సెల్వం సోమవారం రాత్రి చేతులు కలిపారు. ఈ ఇద్దరు నేతలు ఏకం కావడంతో రాష్ట్రంలోని దక్షిణ తమిళనాడులో ఉన్న బలమైన ఓ సామాజిక వర్గం అంతా ప్రస్తుతం వీరి వెంట నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నాడీఎంకేలో బలంగా ఉన్న ఈ సామాజిక వర్గానికి చెందిన ద్వితీయశ్రేణి నేతల చూపు ప్రస్తుతం ఈ ఇద్దరి కలయికపై పడింది. అలాగే దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ సైతం వీరితో చేతులు కలిపిన పక్షంలో దక్షిణ తమిళానాడులో పళణి స్వామిని అన్నాడీఎంకే పరంగా బలహీనుడు చేయవచ్చు అనే యోచనలో ఆ సామాజిక వర్గం ఉండడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అదే సమయంలో దినకరన్‌తో భేటీ సంతృప్తికరంగా జరిగిందని, ఇక, చిన్నమ్మ శశికళను కూడా తాను కలవబోతున్నట్లు పన్నీరు సెల్వం ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, త్వరలో లేదా మరికొద్ది రోజుల్లో చిన్నమ్మ శశికళను కలవనున్నట్లు తెలిపారు. అందరం కలిసి సమష్టిగా ముందుకెళ్తామని, ఐక్యంగా అన్నాడీఎంకేను కై వసం చేసుకుంటామని పన్నీరు సెల్వం ధీమా వ్యక్తం చేయడం గమనార్హం.