భానుపురి (సూర్యాపేట) : ఇళ్లు లేని పేదల కలను నిజం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఎన్నికల హామీలో భాగంగా రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని గతేడాది ప్రారంభించింది. ఈ సమయంలో ఇళ్లు మంజూరుకాని వారి కోసం రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలని ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయించారు. ఈ నిర్ణయంతో ఇప్పటిదాకా మొదటి విడతలో ఇళ్లు రాకుండా.. ఆశగా ఎదురు చూస్తున్న దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో దాదాపు ఇందిరమ్మ ఇళ్ల కోసం మంది 3 లక్షల మందిదాకా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మొదటి విడతలో సుమారుగా 12,868 వేల మందికి ఇళ్లు మంజూరయ్యాయి. జిల్లాలో ఉన్న 600 మందికి రెండో విడతలో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ఇంకా ప్రారంభంకాని 4,616 ఇళ్లు..
జిల్లాకు మొదటి విడత కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం 12,868 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. రూ.5 లక్షలతో ఇళ్ల నిర్మాణం ఎలా అన్న మీమాంసలో పడి చాలామంది లబ్ధిదారులు ముందుకు రాలేదు. తదనంతరం నెమ్మదిగా ఇళ్ల నిర్మాణాలు ఊపందుకోగా.. ఇప్పటి వరకు 1,500లకుపైగా ఇళ్ల గృహ ప్రవేశాలు పూర్తయ్యాయి. వచ్చే నెలాఖరు నాటికి మరో 1,500 ఇళ్ల గృహ ప్రవేశాల జరగాలన్నా లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇంకా 4,616 ఇళ్లకు కనీసం పునాదిరాయి పడని పరిస్థితి నెలకొంది. వేలాది మంది దరఖాస్తులు తమకు ఇళ్లు రాలేదని బాధపడుతుండగా.. ఇళ్లు మంజూరైనా కట్టుకోకుండా ఉన్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు.
ప్రతి నియోజకవర్గానికి 2వేల ఇళ్లకు అవకాశం
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా.. పలు ఆంక్షలతో కూడిన గైడ్‌లైన్స్‌లను విడుదల చేసింది. ఈ నిబంధనల మేరకు ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా.. నిధుల కొరత తదితర కారణాలతో విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నారు. రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 2వేల చొప్పున ఇళ్లను కేటాయించనున్నారు. ఈ రెండు వేల ఇళ్లను తోడుగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. సీఎం కోటాలో మరిన్ని ఇళ్లను జిల్లాకు కేటాయించే అవకాశముందని తెలుస్తోంది. ఇక మొదటి విడతలో ప్రారంభంకాని ఇళ్లను సైతం రద్దు చేయడమా..? రద్దు చేస్తే వాటి స్ధానంలో కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేస్తే మరింత మందికి లబ్ధి చేకూరే అవకాశముంది. లేదంటే ఇళ్లు మంజూరైన లబ్ధిదారులతోనే ఇళ్ల నిర్మాణాలు జరిగేలా చూస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల వివరాలు..
మొదటి విడత మంజూరైనవి 12,868
గృహప్రవేశాలు 1,500 కుపైగా
త్వరలో గృహ ప్రవేశాల లక్ష్యం 1,500
ఇంకా నిర్మాణం ప్రారంభించనివి 4,616
రెండో విడతలో మంజూరయ్యేవి 8,000
రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర కేబినెట్ అంగీకారం
జిల్లాకు త్వరలో 8వేల ఇళ్లు
మంజూరయ్యే అవకాశం
తొలుత 600 మందికి ప్రాధాన్యం
ఎదురుచూపుల్లో దరఖాస్తుదారులు


