తిరుమలగిరి (తుంగతుర్తి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 970 ప్రభుత్వ స్కూళ్లు ఉండగా 690 పీఎస్, 80 యూపీఎస్, 200 హైస్కూళ్లు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని సంకల్పించింది. అదేవిధంగా ఇంటర్ విద్యార్థులకు కూడా అమలు చేయాలని యోచిస్తోంది. ఈ పథకం కింద విద్యార్థులకు పౌష్టికాహారం అందించనున్నారు. రోజుకో రకమైన టిఫిన్‌తో పాటు రోజు విడిచి రోజు పాలు, రాగి, బెల్లం జావా సరఫరా చేయనున్నారు.
పథకం లక్ష్యం..
ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య, హాజరు శాతం పెంచడమే లక్ష్యంగా బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు చేయబోతున్నారు. గత ఏడాది కొడంగల్ నియోజకవర్గంలో ఈ పథకం ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అక్కడ విజయవంతం కావడంతో 2026–27 విద్యా సంవత్సరంలో రాష్ట్రమంతటా అమలు చేయాలని నిర్ణయించారు. విద్యార్థుల్లో పౌష్టికాహారలోపాన్ని, ఆకలిని అరికట్టి, శారీరక, మానసిక వికాసం పెంపొందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని చెబుతున్నారు. కాగా.. గత ప్రభుత్వ హయాంలో 2021లో కొద్ది నెలలు సీఎం బ్రేక్ ఫాస్ట్ పేరుతో 1నుంచి 10 తరగతులకు అల్పాహారం పథకం అమలు చేశారు. అప్పుడు పూరి, ఉప్మా, అటుకుల ఉప్మా, కిచిడీ విద్యార్థులకు అందించారు.
అల్పాహారం సరఫరా ఎలా?
ప్రతి రోజు మధ్యాహ్న భోజనంతోపాటు అల్పాహారం వంట ఏజెన్సీలతో పిల్లలకు అందించాలంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో బ్రేక్ ఫాస్ట్ పథకం వంటశాల ఒక చోట ఏర్పాటు చేసి అన్ని పాఠశాలలకు అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా మండలానికి ఒక హైస్కూల్‌ను ఎంపిక చేసి అక్కడ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు, జూనియర్ కళాశాలలకు అల్పాహారం సరఫరా చేయాలని యోచిస్తున్నారు. విద్యార్థుల ముందు రోజు హాజరును పరిగణలోకి తీసుకుని అల్పాహారం స్కూళ్లకు అందిస్తారు. టిఫిన్‌తోపాటు మధ్యాహ్న భోజనంలో సోమ, శుక్రవారాల్లో ఉడకబెట్టిన కోడి గుడ్డు అందించనున్నారు.
బ్రేక్ ఫాస్ట్ మెనూ ఇలా..
సోమవారం : దోశ – చట్నీ, చపాతి – కూర,
మంగళవారం : మిల్లెట్ ఇడ్లీ (రెండు) – సాంబారు, జావ
బుధవారం : పూరి (రెండు) – ఆలూ కుర్మా
గురువారం : మిల్లెట్ ఇడ్లీ (రెండు) – సాంబారు, జావ
శుక్రవారం : మిల్లెట్ ఉప్మా / పొంగల్, పాలు
శనివారం : బోండా (రెండు) – చట్నీ, రాగి జావ
ఫ ఈ విద్యా సంవత్సరం నుంచే
ప్రభుత్వ పాఠశాలల్లో అమలు
ఫ ఇంటర్ విద్యార్థులకూ
అందించాలని యోచిస్తున్న ప్రభుత్వం


