ఫ శ్రీనిధి రుణం సభ్యులకు పంచకుండా సొంతానికి వాడుకున్న సంఘం లీడర్
ఫ రుణం చెల్లించాలని బ్యాంకు నోటీసులు
అందడంతో లీడర్ ఇంటి ఎదుట
ఆందోళనకు దిగిన మహిళలు
కోదాడ : సమభావన సంఘానికి మంజూరైన శ్రీనిధి రుణాన్ని సభ్యులకు పంచకుండా గ్రూప్ లీడర్ తన సొంత అవసరాలకు వాడుకోవడాన్ని నిరసిస్తూ శనివారం ఆ సంఘానికి చెందిన పలువురు మహిళలు సదరు గ్రూప్ లీడర్ ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. ఈ సంఘటన శనివారం కోదాడ పట్టణ పరిధిలోని అజాద్‌నగర్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోదాడ మున్సిపల్ పరిధిలోని ఆజాద్‌నగర్‌కు చెందిన శ్రీమణికంఠ సమభావన సంఘానికి శ్రీనిధి కింద రూ.4.60 లక్షల రుణం మంజూరైంది. ఈ డబ్బులను సంఘం మొదటి లీడర్ సభ్యులకు పంచకుండా తన సొంత అవసరాలకు వాడుకుంది. తీసుకున్న రుణాలు చెల్లించాలని బ్యాంకు నుంచి నోటీసులు రావడంతో అవాక్కయిన సభ్యులు శనివారం గ్రూప్ లీడర్ తమ్మిశెట్టి బుజ్జి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ వ్యవహారంలో గ్రూప్ రెండవ లీడర్‌కు కూడా ప్రమేయం ఉందని వారు ఆరోపించారు. అధికారులు దీనిపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.


