అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమం నిర్వహించారు. అలాగే క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్థూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. కాగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్ధన్, గణపురం నరేష్, యాదగిరి, ఇంద్రారెడ్డి, దేవిక, అర్చకులు భీంపాండే, అంకిత్‌పాండే పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహుడికి పూజలు
మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం స్వామి వారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేశారు. స్వామి అమ్మవార్లలను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం రక్తి కట్టించారు. అనంతరం విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మదుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.


