భానుపురి (సూర్యాపేట) : ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, రోజుకు 15 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో ధాన్యం సేకరణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అనుకున్న స్థాయిలో ధాన్యం సేకరణ జరగడం లేదని అసంతప్తి వ్యక్తం చేశారు. ప్రారంభంలో రోజుకు 5 వేల నుంచి 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపిన ఆయన.. ఇకపై వేగాన్ని పెంచి రోజుకు 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు లారీలు సమయానికి రావడం లేదని, వచ్చిన లారీలను కూడా సెంటర్ ఇన్‌చార్జిలు కొన్ని నిర్దిష్ట మిల్లులకు మాత్రమే ఎక్కువగా పంపిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మిల్లుల వద్ద లారీలు గంటల తరబడి నిలిచిపోతున్నాయని తెలిపారు. తహసీల్దార్లు ప్రత్యేక బాధ్యత తీసుకొని, మిల్లుల వద్ద లారీలు నిలిచిపోయిన చోట త్వరితగతిన అన్ లోడింగ్ ప్రక్రియ జరిగేలా చూడాలన్నారు. లారీ మిల్లుకు చేరుకున్న 12 గంటలలోపు అన్ లోడింగ్ పూర్తి చేయాలన్నారు. ఒకవేళ అన్ లోడింగ్ చేయకపోతే ఆ లారీలను ప్రత్యామ్నాయ పాయింట్లకు మళ్లించాలని సూచించారు. ఏ మిల్లుకు ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి, ఎంత అన్ లోడింగ్ జరిగింది అనే రిపోర్టుతో పాటు, కొనుగోలు కేంద్రాలకు ఎన్ని లారీలు వస్తున్నాయనే పూర్తి వివరాలను రోజువారీగా సమర్పించాలన్నారు. విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, డీఆర్‌డీఓ సన్యాసయ్య, డీఎస్‌ఓ మోహన్‌బాబు, డీసీఓ ప్రవీణ్‌కుమార్, డీఎం సివిల్ సప్లయీస్ శ్రీధర్‌రెడ్డి, డీఎంఓ నాగేశ్వరశర్మ, ఏఎస్‌ఓ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


