కోదాడ రూరల్ : రైతుల నుంచి మిల్లర్ల దోపిడీని అరికట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం కోదాడ మండలంలోని అల్వాలపురంలో మామిడి తోటలను ఆయన పరిశీలించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మధుసూదన్‌రెడ్డి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించిన ధాన్యానికి మిల్లర్లు కొర్రీలు పెడుతూ క్వింటాకు 5 కేజీల తరుగు తిస్తున్నారని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీని పూర్తి స్థాయిలో చేయకుండా రైతులను నట్టేటా ముంచిందని తెలిపారు. రుణాలు మాఫీ కాని రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం యాసంగి పంటకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వకుండా రైతులను మోసం చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని, రానున్న వానాకాలం సీజన్‌కు నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు. సమావేశంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కోశాధికారి అశోక్‌రెడ్డి, నాయకులు చిట్టిబాబు, వెంకటరామయ్య, కృష్ణయ్య, నారాయణ, రామారావు, వెంకటనర్సయ్య, లక్ష్మణ్, శంకర్ తదితరులు ఉన్నారు.
ఫ బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ
సభ్యుడు గోలి మధుసూదన్‌రెడ్డి


