ఆత్మకూర్.ఎస్ (సూర్యాపేట) : మండలంలోని బొప్పారం గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో తరుగు పేరుతో ధాన్యం కాజేశారని గురువారం రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనపై సాక్షిలో వచ్చిన కథనానికి కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు. శుక్రవారం కొనుగోలు కేంద్రాన్ని డీఎస్‌ఓ శోభన్‌బాబు సందర్శించారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో పాటు బాధిత రైతును, అక్కడ ఉన్న రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్య పడొద్దన్నారు. కేంద్రాలలో ఉన్న సమస్యలను రైతులు తమ దృష్టికి తీసుకురావాలని, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని సూచించారు. విచారణ నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందించ నున్నట్లు తెలిపారు. ఆయన వెంట డీసీఓ శ్రీధర్, తహసీల్దార్ అమీన్ సింగ్, ఏఓ దివ్య, కేంద్ర నిర్వాహకులు ఉన్నారు.


