మిల్లుల ఎదుటే పడిగాపులు | - | Sakshi
Sakshi News home page

మిల్లుల ఎదుటే పడిగాపులు

May 16 2026 6:27 AM | Updated on May 16 2026 6:27 AM

భానుపురి (సూర్యాపేట) : తాము పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు కాకుండా నెలల తరబడి ధాన్యం కుప్పల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తుండగా.. మిల్లులకు వెళ్లిన లారీల్లోని ధాన్యం దిగుమతి కావడానికి మూడు, నాలుగు రోజులు పడుతోంది. చివరికి తాలు, తరుగు పేరుతో క్వింటాకు ఐదు, ఆరు కిలోలకు పైగానే కోత విధిస్తూ మిల్లర్లు రైతులను నిండా ముంచుతున్నారు. ఇదంతా కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, మిల్లర్ల మధ్య సయోధ్యతోనే జరుగుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.

మిల్లుల వద్ద పడి గాపులు

రెండు రోజుల క్రితం వరకు జిల్లాలోని 335 కొనుగోలు కేంద్రాల్లో సగానికి పైగా ధాన్యం రాశులు కాంటాలకు నోచుకోలేదు. కొనుగోళ్లు ప్రారంభమై 50 రోజులు దాటినా.. ఇంకా కొనుగోళ్లు నత్త నడకన సాగడంపై రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో ఆగమేఘాలపై జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కాంటాలు పూర్తిచేసి మిల్లులకు తరలించారు. అయితే మిల్లుల్లో హమాలీల కొరతతో పాటు మిల్ల ర్లు కొర్రీలు పెట్టడంతో ధాన్యం లారీలు అక్కడే నిలిచిపోయింది. సెంటర్ల నుంచి మిల్లులకు వెళ్లిన లారీలు, ట్రాక్టర్లు తిరిగి రాకపోవడంతో సెంటర్లలో కాంటాలు సైతం నిలిచిపోయాయి. మూడు రోజులుగా మిల్లుల వద్ద లారీలు, ట్రాక్టర్ల యజమానులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి మిల్లుల వద్దకు వెళ్లిన లారీల్లోని ధాన్యం బస్తాలను వెంటనే దిగుమతి చేయించి వాహనాలను సెంటర్లకు తరలించాలని, ఎలాంటి తరుగు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

2,42, 547 మెట్రిక్‌ టన్నులు సేకరణ

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,42,547 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ సేకరించింది. శుక్రవారం ఒక్కరోజే 9,971 ధాన్యాన్ని సేకరించారు. ఇందులో 2,27,917 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. మరో 14,630 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఆయా కొనుగోలు కేంద్రాల్లోనే పేరుకు పోయింది. ప్రధానంగా కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలిన లారీలు, ట్రాక్టర్లు తిరిగి సెంటర్లకు రాకపోవడంతో సెంటర్ల నిర్వాహకులు కాంటాలు నిలిపివేశారు.

ధాన్యం దిగుమతికి అడ్డంకులు

తాలు, తరుగు పేరుతో కోతలు

పెడుతున్న మిల్లర్లు

ఇంకా కొనుగోలు కేంద్రాల్లోనే

సగానికి పైగా ధాన్యం

ఇబ్బందులు పడుతున్న రైతులు

సగం బస్తాలు చిరిగినవే..

అర్వపల్లి : కొనుగోలు కేంద్రాలలో రైతులు తీసుకొచ్చిన ధాన్యం నింపేందుకు బస్తాల కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేంద్రాలకు ప్రభుత్వం నుంచి సరఫరా అయ్యే గన్నీ బ్యాగులలో సగానికిపైగా చిరిగి, పాడైన బస్తాలు వస్తున్నాయి. ఈ బస్తాలలో ధాన్యం నింపినా వాటికుండే రంద్రాల ద్వారా బయట పడుతున్నాయి. దాంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జాజిరెడ్డిగూడెం మండలం సూర్యానాయక్‌తండా ఐకేపీ కేంద్రానికి 25వేల గన్నీ బ్యాగులు రాగా అందులో 10వేల బ్యాగులు మాత్రమే కొత్తవి ఉండగా మిగతావన్నీ చిరిగి పాడైపోయి ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలకు కొత్త గన్నీ బ్యాగులను సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement