ఆత్మకూర్.ఎస్ (సూర్యాపేట) : గోదాములకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, శ్రీరామ గోదామును ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా ఉండగా ఇప్పటికే 2.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు పూర్తయినట్లు చెప్పారు. గోదాముల వద్ద ధాన్యం దిగుమతి కోసం హమాలీల కొరత ఉన్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దిగుమతుల కోసం ప్రతి మండలానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రతి మిల్లుకు ఒక ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మరో 10 రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులు కొన్ని కేంద్రాలలో ఇబ్బందులకు గురవుతున్నారని, అలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయన వెంట తహసీల్దార్ అమీన్ సింగ్, ఏఓ దివ్య, సర్పంచ్ ములకలపల్లి కాటయ్య, ఏపీఓ ఈశ్వర్, సీఈఓ లక్ష్మారెడ్డి, సీపీ ముత్తయ్య, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, సోమిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఉన్నారు.
కొనుగోలు కేంద్రాల తనిఖీ
నూతనకల్ : మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాంటా పూర్తయిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి లారీల కొరత ఉన్నందున అధికారులు సమన్వయంతో పనిచేసి రవాణా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ ఎం. శ్రీనివాసరావు, ఎస్‌ఐ నాగరాజు, ఎంపీఓ శశికళ, ఆర్‌ఐ హసన్, జీపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, కేంద్రాల నిర్వాహకులు ఉన్నారు.
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్


