నిలిచిన క్రయవిక్రయాలు.. | - | Sakshi
Sakshi News home page

నిలిచిన క్రయవిక్రయాలు..

May 15 2026 12:49 PM | Updated on May 15 2026 12:49 PM

తిరుమలగిరి (తుంగతుర్తి) : ఎంకి చావు సుబ్బి పెళ్లికొచ్చినట్లు తయారైంది తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌ పరిస్థితి. ప్రభుత్వం మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం.. అంచనాలకు మించి మొక్కజొన్నలు రావడంతో మార్కెట్‌ యార్డు నిండిపోయింది. దీంతో గత శనివారం నుంచి మా ర్కెట్‌కు తాళం పడింది. ఫలితంగా అటు రైతన్నలు, ఇటు కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కాంటాలు కాకపోవడంతో..

తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌ జిల్లాలోనే పేరొందిన రెగ్యులర్‌ మార్కెట్‌. ప్రతిరోజు ధాన్యం, ఇతర పంటలు 10 వేల బస్తాలకు పైగానే వస్తుంటాయి. సూర్యాపేట జిల్లా నుంచే కాకుండా యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబాబాద్‌ జిల్లాల నుంచి కూడా రైతులు తమ పంటలను మార్కెట్‌ యార్డుకు తీసుకొస్తుంటారు. అయితే గత నెల 18వ తేదీన వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. సూర్యాపేట జిల్లాలో రెండు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మాత్రమే ప్రారంభించడంతో తిరుమలగిరి కొనుగోలు కేంద్రానికి ఒకేసారి 20 వేల బస్తాలు వచ్చాయి. రైతులు వివిధ ప్రాంతాల నుంచి మొక్కజొన్నలు తీసుకొచ్చి మార్కెట్‌ యార్డులో ఎక్కడ పడితే అక్కడ పోశారు. దీనికితోడు మొక్కజొన్నలు తేమగా ఉండడంతో రైతులు ఇక్కడే ఆరబెడుతున్నారు. కొనుగోళ్లు ఆలస్యం కావడం, కాంటాలు కాకపోవడం, కాంటాలైన బస్తాలకు లారీలు సరిగ్గా రాక ఎగుమతులు ఆలస్యమవుతున్నాయి. ధాన్యం, మొక్కజొన్నల బస్తాలతో మార్కెట్‌ నిండిపోవడంతో గత శనివారం నుంచి వ్యవసాయ మార్కెట్‌ను బంద్‌ చేశారు.

ఇబ్బందులు పడుతున్న హమాలీలు..

తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో హమాలీలు, స్వీపర్లు, దడ్వాయిలు మొత్తం 500 కుటుంబాలకుపైగానే వివిధ పనులు చేస్తుంటారు. ప్రతిరోజు మార్కెట్‌ నడిస్తేనే వీరికి ఉపాధి కలుగుతుంది. మార్కెట్‌లో క్రయ విక్రయాలు బంద్‌ కావడంతో తమ కుటుంబాలు వీధిన పడే అవకాశం ఉందని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పాలకవర్గం స్పందించి వ్యవసాయ మార్కెట్‌ యార్డు ప్రతిరోజు యథావిధిగా నడిచేలా చూడాలని కోరుతున్నారు.

తక్కువ ధరకే విక్రయం

వ్యవసాయ మార్కెట్‌ యార్డు బంద్‌ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు తమ ధాన్యాన్ని ప్రైవేట్‌ వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయించి పోతున్నారు. ధాన్యాన్ని ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో కిరాయికి తీసుకుని రావడంతో మరలా ఇంటికి తీసుకు పోలేక తక్కువ ధరకై నా ప్రైవేట్‌ వ్యక్తులకే విక్రయిస్తున్నారు.

ఫ ధాన్యం, మొక్కజొన్న బస్తాలతో నిండిన

తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌

ఫ స్థలం లేక తాత్కాలికంగా మూసివేసిన అధికారులు

ఫ రైతులకు అందని ముందస్తు సమాచారం

ఫ ధాన్యం తీసుకొచ్చి ఇబ్బందులు

పడుతున్న కర్షకులు

ఫ ఉపాధి కోల్పోతున్న హమాలీలు, స్వీపర్లు

Advertisement
 
Advertisement
Advertisement