ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

May 15 2026 12:49 PM | Updated on May 15 2026 12:49 PM

సూర్యాపేటటౌన్‌ : ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం మొదటి సంవత్సరం పరీక్ష జరగ్గా మొత్తం 723 మంది విద్యార్థులకు గాను 680 మంది హాజరు కాగా 43 మంది గైర్హాజరయ్యారు. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్ష మధ్యాహ్నం జరగ్గా 2,382 మంది విద్యార్థులకు గాను 2225 మంది హాజరు కాగా 157 మంది గైర్హాజరైనట్టు డీఐఈఓ సులోచన రాణి తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్టు చెప్పారు.

బక్రీద్‌కు

కట్టుదిట్టమైన భద్రత

సూర్యాపేటటౌన్‌ : బక్రీద్‌ పండుగ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. బక్రీద్‌కు భద్రతా ఏర్పాట్లపై బుధవారం అన్ని జిల్లాల పోలీస్‌ అధికారులతో హైదరాబాద్‌ నుంచి డీజీపీ సి.వి. ఆనంద్‌ వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా పోలీస్‌కార్యాలయంలో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ పాల్గొన్న అనంతరం అధికారులతో మాట్లాడారు. పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. గోవుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని వివరించారు. అంతర్‌ జిల్లా సరిహద్దుల్లో 8 చెక్‌ పోస్ట్‌ లు ఏర్పాటు చేసి 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. మసీదులు, ప్రధాన కూడళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్‌, శ్రీనివాస్‌ రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ రామారావు, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులు, వ్యసాయ మార్కెట్‌ అధికారులు, ఐటీ కోర్‌ ఆర్‌ఎస్‌ఐ రాజశేఖర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దాం

కోదాడ: ప్రభుత్వ బడులను బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, స్ధానిక ప్రజాప్రతినిధులు దీనికి సహకరించాలని జిల్లా విద్యాధికారి అశోక్‌ కోరారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా బుధవారం కోదాడలోని సీసీ రెడ్డి విద్యానిలయంలో కోదాడ నియోజకవర్గ స్ధాయి సర్పంచ్‌లు, మున్సిపల్‌ కౌన్సిలర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు, అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని తల్లిదండ్రులు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని కోరారు. ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు ఎడ్యుకేషన్‌ కిట్‌ అందిస్తున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులు తరచూ ప్రభుత్వ పాఠశాలలను సదర్శించి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీఓ రాంబాబు, డీఎల్‌పీఓ పార్థసారధి, ఎంఈఓలు సలీంషరీఫ్‌, శ్రీనివాసరావు, నరసింహారెడ్డి, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, గోపాలరావుతో పాటు పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement