భానుపురి (సూర్యాపేట) : ఈ వేసవి సీజన్‌లో ఎండల తీవ్రత అధికంగానే ఉంది. ఉక్కపోత కారణంగా జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. గురువారం జిల్లావ్యాప్తంగా ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఉదయం నుంచే ఓ వైపు మబ్బుల ఎండ, మరోవైపు గాలి లేకపోవడంతో ఉక్క పోసింది. కనీసం ఇంట్లో నుంచి అడుగు తీసి బయట పెట్టలేని పరిస్థితి. రోహిణి కార్తె మరో 10 రోజులు ఉండగానే ఎండ, ఉక్కపోత, వేడిగాలులు రావడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు ఈ వాతావరణానికి తట్టుకోలేకపోతున్నారు.
తీవ్ర వేడి..
ఈసారి అకాల వర్షాలు కురవకపోవడంతో తీవ్ర వేడి నెలకొంది. కనీసం మోస్తరు వర్షం కురిసినా ఎండల తీవ్రత కొంతమేర తగ్గేది. గురువారం దాదాపు జిల్లాలోని 23 మండలాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా నూతనకల్ మండలంలో 42.8, పెన్‌పహాడ్ మండలంలో 42.6, నేరేడుచర్లలో 42.5 ఇలా... 11 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తుంగతుర్తి మండలంలో 40.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
అల్లాడిన జనం..!
గడిచిన రోజుల్లో ఎండ తీవ్రత ఉన్నప్పటికీ గాలి వీయడంతో జనం అంతగా ఇబ్బంది పడలేదు. గురువారం ఉదయం 7గంటల నుంచే జిల్లాలో వాతావరణం భిన్నంగా మారింది. అంతగా ఎండ లేకపోయినప్పటికీ ఏమాత్రం గాలి లేకపోవడంతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సమయం గడుస్తున్న కొద్దీ ఎండ తీవ్రత అధికం కాగా.. ఉక్కపోత అలాగే ఉండిపోయింది. ప్రధానంగా రోడ్ల వెంట వ్యాపారులు, మార్కెట్లలో హమాలీలు, రైతులు, ఉపాధి హామీ కూలీల బాధ వర్ణనాతీతం. దీనికి తోడుగా జిల్లాలోని పలు మండలాల్లో ఈదురు గాలులకు చెట్ల విరిగి విద్యుత్ తీగలపై పడకుండా ఉండేందుకు అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేసి చెట్ల కొమ్మలను నరికివేస్తున్నారు. ఓ వైపు ఉక్కపోత.. మరోవైపు కరెంటు లేకపోవడంతో ఇళ్లలో జనం ఉండలేని పరిస్థితి నెలకొంది.
జిల్లాలో గురువారం నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా..
మండలం గరిష్ట ఉష్ణోగ్రత
నూతనకల్ 42.8
పెన్‌పహాడ్ 42.6
నేరేడుచర్ల 42.5
మోతె 42.4
చివ్వెంల 42.2
మేళ్లచెరువు 42.2
సూర్యాపేట 42.2
హుజూర్‌నగర్ 42.2
మునగాల 42.1
గరిడేపల్లి 42.0
మద్దిరాల 42.0
తిరుమలగిరి 41.9
నడిగూడెం 41.8
చిలుకూరు 41.5
మఽఠంపల్లి 41.2
ఆత్మకూర్ (ఎస్) 40.8
అనంతగిరి 40.5
కోదాడ 40.5
నాగారం 40.5
పాలకీడు 40.3
చింతలపాలెం 40.3
జాజిరెడ్డిగూడెం 40.3
తుంగతుర్తి 40.3
ఫ జిల్లా అంతటా ఎండ తీవ్రత
40 డిగ్రీలకు పైగానే
ఫ అల్లాడుతున్న ప్రజలు


