ధాన్యం కొనుగోళ్లలో వేగం పెరగాల్సి ఉంది | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెరగాల్సి ఉంది

May 13 2026 5:02 AM | Updated on May 13 2026 5:02 AM

ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలి

భానుపురి (సూర్యాపేట) : ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన సమావేశంలో (వెబెక్స్‌) ఆయన మాట్లాడారు. అకాల వర్షాల ముప్పును దృష్టిలో ఉంచుకుని యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు చేపట్టాలన్నారు. జిల్లాలో ఈ సీజన్‌లో 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని అంచనా వేయగా, సోమవారం వరకు 2 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించామని కలెక్టర్‌ తెలిపారు. మిల్లుల వద్ద అన్‌ లోడింగ్‌ ప్రక్రియ నెమ్మదించడంపై కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. మిల్లుల వద్ద హమాలీల సంఖ్యను రెండింతలు పెంచి, మూడు షిఫ్టుల్లో పనులు జరిగేలా చూడాలని ఆదేశించారు. ధాన్యం దిగుమతి చేసుకోవడంలో నిర్లక్ష్యం వహించే మిల్లర్లపై చట్టపరమైన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే ప్రైవేట్‌, అదనపు గోదాములను అద్దెకు తీసుకుని ధాన్యాన్ని నిల్వ చేయాలని సూచించారు. ధాన్యం తరలింపు కోసం ప్రస్తుతం ఉన్న 670 లారీలు సరిపోవడం లేదని, అదనపు లారీలు, డీసీఎంలను ఏర్పాటు చేసేందుకు పోలీస్‌, రవాణా శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకు 5 కిలోమీటర్ల లోపు దూరం ఉంటే, లారీల కోసం వేచి చూడకుండా ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తరలించాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద గన్నీ బ్యాగులు, హమాలీలు అందుబాటులో ఉండేలా తహసీల్దార్లు, మండల అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతి మిల్లు వద్ద అన్‌ లోడింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించడానికి ఒక ఇంచార్జ్‌ అధికారిని నియమించాలని సూ చించారు. ఈ సమావేశంలో ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్‌ హరిసింగ్‌, జిల్లా పరిషత్‌ సీఈవో శిరీష, డీఆర్డీడీవో సన్యాసయ, డీఎస్‌వో మోహన్‌ బాబు, డీఏఓ శ్రీధర్‌రెడ్డి, డీసీవో ప్రవీణ్‌కుమార్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు

కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్‌ తేజస్‌నంద్‌లాల్‌ పవార్‌ పరిశీలించారు. లారీల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రతి రోజు ధాన్యం కొనుగోళ్లను సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని కోరారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ శ్రీకాంత్‌, ఏఓ గణేష్‌, ఎంపీడీఓ ఝాన్సీ, సీఈఓ సత్యనారాయణ, ఏఈఓ సత్యం ఉన్నారు.

మిల్లుల పరిశీలన..

తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి, తొండ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ మంగళవారం పరిశీలించారు. అదేవిధంగా ఏఎస్‌ఆర్‌ రైస్‌ ఇండస్ట్రీ, సోమేశ్వర రైస్‌ ఇండస్ట్రీ మిల్లులను సందర్శించి, ధాన్యం అన్‌ లోడింగ్‌ ప్రక్రియను చూశారు. మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్‌ లోడ్‌ చేయాలని సూచించారు. తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఫ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

ఫ మిల్లుల వద్ద అన్‌ లోడింగ్‌

నెమ్మదించడంపై ఆగ్రహం

నాగారం : ఐకేపీ కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ ఆదేశించారు. మంగళవారం నాగారం మండల పరిధిలోని ఈటూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్‌ మిల్లులకు తరలించేలా రవాణా సౌకర్యాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ దేవేంద్రప్రసాద్‌, రైస్‌ మిల్లర్లు, యజమానులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement