నూతన పాలకవర్గం ప్రక్షాళన చేయాలి
కోదాడ : ప్రజలు చెల్లించిన పన్నులను వేతనాలుగా తీసుకుంటున్న కోదాడ మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు. తమ వద్ద పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులు ఎందరనే వివరాలు వారికి తెలియకపోవడం గమనార్హం. గత పాలకవర్గాలు, వాటి పెద్దలు ఇష్టారాజ్యంగా కోదాడ మున్సిపాలిటీలో తమ అనుయాయులను ఉద్యోగులుగా పెట్టుకున్నారు. ఇదే అదునుగా తామేమీ తక్కువ కాదన్నట్లు కొందరు అధికారులు కూడా ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. కానీ ఇప్పటికీ ఉద్యోగుల వివరాలు తేలకపోవడంతో మూడు రోజుల క్రితం నూతన పాలకవర్గం మొత్తం కార్మికులను మున్సిపల్ కార్యాలయం వద్దకు పిలిచి ఫిజికల్ వెరిఫికేషన్ చేసింది. దీనిలో పనిచేయని 8మంది ఉద్యోగుల పేరుతో ప్రతినెలా రూ.1.20 లక్షలు అదనంగా చెల్లిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినప్పటికీ కార్మికుల సంఖ్యలో స్పష్టత రాకపోవడం గమనార్హం.
22 ఏజెన్సీల ద్వారా పనిచేస్తున్న కార్మికులు
కోదాడ మున్సిపాలిటీలో గతంలో 21 అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా 183 మంది వరకు కార్మికులు పనిచేసేవారు. గత పాలకవర్గంలో పెద్దలు దిగిపోతూ 22వ ఏజెన్సీ ద్వారా మరో 8 మందిని నియమించారు. దీంతో ప్రస్తుతం ఏజెన్సీల సంఖ్య 22కు చేరింది. ఈ 22వ ఏజెన్సీని ఎవరు.. ఎప్పుడు తీసుకున్నారనే విషయంలో స్పష్టత లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఒక్క మున్సిపాలిటీలో ఇన్ని ఏజెన్సీలు ఎందుకు ఉన్నాయో అర్థం కావడం లేదని కౌన్సిలర్లు చెబుతున్నారు. ఇక మున్సిపాలిటీకి అన్నిరకాల వాహనాలు కలిపి 20 వరకు ఉన్నాయి. కానీ, 40 మంది వరకు డ్రైవర్ల పేరుతో పనిచేస్తున్నారని, వీరిని ఎవరు నియమించారు.? ఎక్కడ పనిచేస్తున్నారనే విషయంలో అధికారులకే స్పష్టత లేదని పలువురు కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.
అక్కడ నేనే.. ఇక్కడ నేనే!
ఇదిలా ఉండగా కొందరు కార్మికుల పేర్లు రెండు ఏజెన్సీల్లో నమోదై ఉండడాన్ని మూడు రోజుల క్రితం ఫిజికల్ వెరిఫికేషన్ చేసిన నూతన పాలకవర్గం గుర్తించినట్లు సమాచారం. ఇలా 20 మంది వరకు కార్మికుల పేర్లు రెండు ఏజెన్సీల్లో నమోదు చేసి ఒక్కొక్కరికి రెండు వేతనాలు ఇస్తున్నారని వెంటనే వారిని నిలిపివేయాలని కోరినట్లు తెలిసింది. కొందరు విధులకు హాజరు కాకుండానే వేతనాలు తీసుకుంటున్నారు. కార్మికుల రోజువారీ హాజరు కూడా బయోమెట్రిక్ విధానంలో కాకుండా సాధారణ రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారని, దీనివల్లే అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనేది కొందరి వాదన. హాజరు విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని, పనిచేసే వారికే వేతనాలు చెల్లించాలని, ఒకరి పేరుతో ఇద్దరికి వేతనాలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కౌన్సిలర్లు డిమాండ్ చేస్తున్నారు.
కోదాడ మున్సిపాలిటీలో అవుట్‌సోర్సింగ్ కార్మికుల విషయంలో గతంలో జరిగిన అవకతవకలపై నూతన పాలకవర్గం దృష్టిసారించాలి. పూర్తి ప్రక్షాళన చేసి పనిచేసే కార్మికులకే వేతనాలు ఇవ్వాలి. ఇప్పటి వరకు దుర్వినియోగమైన డబ్బును తిరిగి రాబట్టాలి. –రాయపూడి చిన్ని,
ప్రజాచైతన్య వేదిక కన్వీనర్


