నాగార్జునసాగర్ : లక్షలాది ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించే నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నిర్వహణపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. కాల్వలో పేరుకుపోయిన బండరాళ్లు నీటి ప్రవాహానికి ప్రధాన అడ్డంకిగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వ సామర్థ్యం ప్రకారం ప్రవహించాల్సిన నీటికి, వాస్తవ ప్రవాహానికి పొంతన ఉండటం లేదని చెబుతున్నారు. కాల్వలో 11 లక్షల క్యూసెక్కులు ప్రవహించాల్సి ఉండగా, పూడిక, రాళ్ల వల్ల అది 9 నుంచి 10 లక్షల క్యూసెక్కులకు పడిపోయింది. అయితే, ఎడమ కాల్వ వద్ద ఉన్న గేజీ మీటర్ మాత్రం 13 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని చూపిస్తుండడం గమనార్హం. అధికారుల లెక్కల్లో తప్పులు ఉన్నాయని దీని ద్వారా స్పష్టమవుతోంది.
కూలుతున్న దరులు.. పెరిగిన అడ్డంకులు
కాల్వకు ఇరువైపులా ఉన్న రాతి దరులు వర్షాలకు నానుతుండటంతో అప్పుడప్పుడు కాల్వలోకి కూలిపోతున్నాయి. పదేళ్ల క్రితం వాటిని తొలగించారు. కానీ కాల్వ దరులను మాత్రం లైనింగ్ చేయలేదు. దరులపై చెట్లు పెరిగి, వాటి వేర్లు బలంగా పాకడంతో రాళ్లు వదులై నీటిలో పడుతున్నాయి. చిన్న రాళ్లు ప్రవాహానికి కొట్టుకుపోయి బొయ్యారం (టన్నెల్) లోకి చేరుతుండగా, పెద్ద బండరాళ్లు మాత్రం కాల్వలోనే ఉండిపోయి నీటి వేగాన్ని తగ్గిస్తున్నాయి. జలాశయం లోపల ఉన్న అప్రోచ్ కెనాల్‌లో పడిన రాళ్లను ఇప్పటి వరకు తొలగించకపోవడం అధికారుల ఉదాసీనతకు నిదర్శనం. చేపల వేట కోసం కొందరు ఉపయోగిస్తున్న నాటు బాంబుల వల్ల కూడా ఈ రాతి దరులు బీటలు వారి నీటిలో పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
రాళ్లు తొలగించేందుకు ఇదే తగిన సమయం
ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం తగ్గింది. అప్రోచ్ ఛానల్ మొత్తం బయటపడటంతో, అందులో పేరుకుపోయిన బండరాళ్లను తొలగించడానికి ఇదే సరైన సమయమని రైతులు సూచిస్తున్నారు. తూము ముందు భాగంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తేనే వచ్చే సీజన్ నాటికి నీటి సరఫరా సజావుగా సాగుతుంది.
ఫ ఎడమకాల్వ అప్రోచ్ కెనాల్,
తూము వద్ద కూలుతున్న దరులు
ఫ ఏళ్లు గడుస్తున్నా
తొలగించని అధికారులు
ఫ లైనింగ్ చేయాలని రైతుల డిమాండ్
మరమ్మతులకు నిధులిస్తేనే..
కాల్వ దరులు పటిష్టంగా ఉండాలంటే ‘షార్ట్‌క్రీటింగ్’ పద్ధతిని చేపట్టాలని రిటైర్డ్ ఇంజనీర్లు సూచిస్తున్నారు. సన్నని ఇనుప జాలీని అమర్చి సిమెంట్‌తో లైనింగ్ చేయడం వల్ల దరులు కూలకుండా ఉంటాయి. ఇలా చేయడం వల్ల దరులపై చెట్లు మొలిచే అవకాశం కూడా ఉండదు. పెద్ద బండలకు డ్రిల్లింగ్ చేసి ఇనుప రాడ్లను అమర్చడం ద్వారా అవి కాల్వలో పడకుండా శాశ్వత పరిష్కారం చూపవచ్చు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, కాల్వ మరమ్మతులకు యుద్ధప్రాతిపదికన నిధులు మంజూరు చేయాలని ఆయకట్టు రైతాంగం డిమాండ్ చేస్తోంది.


