కుటుంబ ప్రయోజన పథకం.. ఇక సులభం | - | Sakshi
Sakshi News home page

కుటుంబ ప్రయోజన పథకం.. ఇక సులభం

May 11 2026 9:37 AM | Updated on May 11 2026 9:37 AM

భానుపురి (సూర్యాపేట) : పేద ప్రజలకు ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఇంటి పెద్ద ఏదైనా కారణంతో మరణిస్తే రూ.2 లక్షల ఆర్థిక ప్రయోజనం కల్పించనుంది. మరణించిన తర్వాత జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారికి ఈ సొమ్మును అందించనుంది. గతంలో దరఖాస్తులను తహసీల్దార్లు విచారణ చేసి నివేదికలను కలెక్టర్లకు పంపితే నిధులు మంజూరు చేసేవారు. ఈ క్రమంలో జాప్యం చోటు చేసుకునేది. ప్రస్తుతం లబ్ధి పొందే విధానంలో మార్పులు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు వెలువరించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓలు, పుర, నగరపాలికల్లో కమిషనర్లకు అర్హులను గుర్తించే అధికారాన్ని అప్పగించారు. ఇందుకు నిర్దిష్ట గడువు కూడా విధించడంతో దరఖాస్తులు త్వరితగతిన పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి.

దరఖాస్తులు ఇలా..

ఆహార భద్రత కార్డు, మృతుడి ఆధార్‌ కార్డు, గ్రామపంచాయతీ నుంచి తీసుకున్న మరణ ధ్రువీకరణ పత్రం, మృతుడి వయస్సు నిర్ధారణ పత్రం, దరఖాస్తుదారుని ఆధార్‌ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం, దరఖాస్తుదారుని బ్యాంకు ఖాతా పుస్తకాలన్ని జతచేసి మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న తర్వాత పత్రాలను ఎంపీడీఓ కార్యాలయాల్లో అందించాల్సి ఉంది.

పది రోజుల్లో పరిశీలన..

బాధిత కుటుంబ సభ్యులు అన్ని పత్రాలు జతచేసి ఎంపీడీఓ, పుర, నగరపాలక సంస్థ కార్యాలయాల్లో అందించిన పది రోజుల వ్యవధిలో విచారణ పూర్తిచేసి నివేదికలు సమర్పించాలి. గతంలో రెవెన్యూ శాఖ పరిధిలో ఉండడంతో క్షేత్ర స్థాయి విచారణలో జాప్యం చోటు చేసుకునేది. రెవెన్యూ శాఖలో వివిధ రకాల పనులు ఉండడంతో ఈ దరఖాస్తుల పరిశీలనకు అధికారులకు సమయం లేకుండా పోయేది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం తాజా మార్పులు తీసుకురావడంతో వేగంగా నిధులు మంజూరయ్యే అవకాశాలున్నాయి.

ఫ కీలక మార్పులు తెచ్చిన కేంద్రం

ఫ తహసీల్దార్ల నుంచి

ఎంపీడీఓలకు బాధ్యతలు

ఫ ఇంటి పెద్దను కోల్పోయిన పేద

కుటుంబాలకు రూ.2 లక్షల సాయం

18 నుంచి 60 ఏళ్ల లోపు..

కుటుంబాన్ని పోషించే 18 నుంచి 60 ఏళ్ల లోపు వ్యక్తిని కోల్పోయిన వారు గ్రామాల్లో అయితే పంచాయతీ కార్యాలయాలు, పట్టణాల్లో పురపాలికల్లో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి మంజూరుకు సిఫార్సు చేస్తే ఎవరి ప్రమేయం లేకుండా నిధులు నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమఅవుతాయి. 2017, ఏప్రిల్‌ 13 తర్వాత మరణించిన వారి కుటుంబ సభ్యులు దీనికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement