అదనపు కలెక్టర్‌ బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

అదనపు కలెక్టర్‌ బాధ్యతల స్వీకరణ

May 9 2026 7:32 AM | Updated on May 9 2026 7:32 AM

భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా నూతన రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా బి.హరిసింగ్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ను కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరిసింగ్‌కు కలెక్టర్‌ శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్‌కు జిల్లా రెవెన్యూ అధికారులు, కలెక్టరేట్‌ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

11వ తేదీ నుంచి

విద్యా వారోత్సవాలు

సూర్యాపేటటౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 11 నుంచి ఎంపిక చేయబడిన పాఠశాలల్లో 15 రోజుల సమ్మర్‌ క్యాంప్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఇంటర్‌ సప్లిమెంటరీ

పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

భానుపురి (సూర్యాపేట) : ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్నందున పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ బి.హరిసింగ్‌ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.. శుక్రవారం కలెక్టరేట్‌లో అడిషనల్‌ కలెక్టర్‌ చాంబర్‌లో ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలపై విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకు థియరీ పరీక్షలు జరుగుతాయని, మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 12గంటల వరకు, రెండో సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు పరీక్షలు ఉంటాయని తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా సీసీ కెమెరాల నిఘా, పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ రవీందర్‌రెడ్డి, డీఐఈఓ బి.సులోచనరాణి, భానునాయక్‌, ప్రసాద్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలి

చిలుకూరు : రైతులు వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమను అనుబంధ రంగంగా ఎంచుకుంటే ఆర్థికంగా బలోపేతం అవుతారని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ బి.శ్రీనివాస్‌రావు అన్నారు. శుక్రవారం ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చిలుకూరు పశువైద్యశాలలో పశువైద్య శిబిరంతోపాటు మేలు జాతి దూడల ప్రదర్శనను సర్పంచ్‌ కొల్లు పుల్లమ్మ నాగయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేలు జాతి గ్రాసాలను పెంచుకోవాలని, అప్పుడే తక్కువ ఖర్చుతో పాల ఉత్పిత్తి అధికంగా పెంచవచ్చన్నారు. మేలుజాతి దూడలు, మేలు జాతి గడ్డి ప్రదర్శనలను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి తిలకించారు. అనంతరం ఈ ఏడాది అత్యధికంగా పాలు పోసిన రైతులు సుజాత, శ్రీనులను ఘనంగా సన్మానించారు. పశువైద్య శిబిరంలో 63 పశువులకు ఉచిత గర్భకోష వ్యాధి చికిత్స చేశారు. కార్యక్రమంలో జిల్లా మత్స్య సొసైటీ అధికారి నాగులనాయక్‌, డీసీఓ ప్రవీణ్‌, ఏడీఏ డాక్టర్‌ పెంటయ్య, ఏడీఓ ప్రశాంతికుమారి, మండల పశువైద్యాధికారి వీరారెడ్డి, మండల వ్యవసాయాధికారి శ్రీధర్‌, సర్పంచ్‌ కొల్లు పుల్లమ్మ నాగయ్య, ఉప సర్పంచ్‌ బెల్లంకొండ నాగయ్య, ఫ్యాక్స్‌ చైర్మన్‌ అలసకాని జనార్దన్‌, గ్రామ మత్స్యసొసైటీ అధ్యక్షుడు రామకృష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement