సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయాలి
చిలుకూరు : వేసవిలో ఆకుకూరలు, కూరగాయలకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో చిలుకూరు మండలంలోని పలు గిరిజన తండాల్లో వాటిని సాగు చేయడానికి గిరిజన రైతులు ఆసక్తి చూపుతున్నారు. చిలుకూరు మండలంలోని జానకీనగర్, దూదియాతండా, శీత్లాతండా, కొమ్ముబండ తండా, సీతరాంతండా గ్రామాల్లో గిరిజన రైతులు ఎక్కువగా ఆకు కూరలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. తమకున్న కొద్దిపాటి భూముల్లో బోర్లు, వ్యవసాయ బావుల కింద 5 గుంటలు, 10 గుంటల భూమిలో ఆకు కూరలు సాగు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ గ్రామాల్లో దాదాపుగా 50 మందికి పైగా రైతులు 20 ఎకరాల్లో ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తున్నారు.
గతంలో దళారులకు అమ్మి
మోసపోయిన గిరిజనులు
గిరిజన తండా రైతులు తాము పండించిన పంటలను స్వయంగా విక్రయిస్తున్నారు. గతంలో దళారులకు అమ్మి తీవ్రంగా నష్ట్రపోయామని.. దీంతో తామే స్వయంగా అమ్మకుంటున్నామని పలువురు గిరిజన రైతులు అంటున్నారు. గిరిజన తండా రైతులు ఉదయం వేళల్లో మోటార్ బైక్‌లపై వివిధ రకాలు ఆకు కూరలు, కూరగాయలను కట్టుకొని చిలుకూరు మండలంలోని పలు గ్రామాల్లో, హుజూర్‌నగర్, కోదాడ పట్టణాల్లో విక్రయిస్తున్నారు. మహిళలు గంపలతో ఇంటింటికీ తిరుగుతూ తండాల చుట్టు పక్కల గ్రామాల్లో అమ్ముతుంటారు. ప్రధానంగా గిరిజన రైతులు గోంగూర, బచ్చలకూర, తోటకూర, పాలకూర, పుదీనా, కొత్తిమీర లాంటి ఆకుకూరలు.. వంకాయలు, దొండకాయలు, బెండకాయలు, దోసకాయలు లాంటి కూరగాయలు సాగు చేస్తూ అమ్ముకుంటున్నారు. ఆకు కూరలను ప్రతి పది రోజుల ఒకసారి కోసి కట్టలు కట్టి విక్రయిస్తామని పలువురు గిరిజన రైతులు తెలిపారు.
ఫ ఆకుకూరలు, కూరగాయల
సాగుపై గిరిజనుల ఆసక్తి
ఫ ఎరానికి రూ.10 వేల నుంచి
15 వేల వరకు ఆదాయం
ఫ సబ్సిడీపై విత్తనాలు, పురుగు
మందులు అందించాలని వినతి
ఎండాకాలంలో నిత్యం కాపలా..
కూరగాయల సాగుకు ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఆదాయం వస్తోందని రైతులు అంటున్నారు. కాగా ఎండాకాలంలో రైతులు తమ గేదెలను అడవికి వదలడం వల్ల ఆకు కూరలు, కూరగాయల తోటల వద్ద నిత్యం కాపలా ఉండాల్సి వస్తోందని గిరిజన రైతులు చెబుతున్నారు. అలాగే ప్రభుత్వం సాగుకు కావాల్సిన విత్తనాలను సబ్సిడీపై అందిస్తే ఇంకా మరి కొంత మంది రైతులు సాగుపై ఆసక్తి చూపుతారని పేర్కొంటున్నారు.
ఈ వేసవిలో ప్రస్తుతం మా కుటుంబ సభ్యులం బచ్చలకూర, గోంగూర, పాలకూర తదితర ఆకు కూరలు సాగు చేశాం. ప్రతి రోజు సాగులో పని ఉంటుంది. మందులు కొట్టడం, కూరగాయల సాగులో గడ్డి తీయడం లాంటి పనులు చేస్తున్నాం. ప్రతిరోజు ఆకుకూరలను స్వయంగా గ్రామంలో తిరుగుతూ అమ్ముకుంటున్నా, రోజుకు రూ.1000 వరకు వస్తున్నాయి, విత్తనాల రేట్లు కూడా విపరీతంగా ఉన్నాయి. ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయాలి.
– భూక్యా లక్కి, దూదియాతండా


