1.85 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాం | - | Sakshi
Sakshi News home page

1.85 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాం

May 9 2026 7:32 AM | Updated on May 9 2026 7:32 AM

భానుపురి (సూర్యాపేట) : ప్రస్తుత యాసంగి సీజన్‌ 2025–26 కు సంబంధించి 1.85 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైతుల నుంచి సేకరించి రైస్‌ మిల్లులకు పంపించామని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌, జిల్లా రైస్‌ మిల్లర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇంకా సుమారు 1.55 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యం మిల్లుల వద్దకు వచ్చిన వెంటనే అన్‌ లోడింగ్‌ చేయాలని సూచించారు. రైస్‌ మిల్లర్ల సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎలాంటి సమస్య రాకుండా చూడాలన్నారు. ధాన్యం మిల్లింగ్‌ పూర్తి చేసిన తదుపరి సీఎంఆర్‌ పెండింగ్‌ లేకుండా ఎఫ్‌సీఐ కి బియ్యం అందజేయాలన్నారు. కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సివిల్‌ సప్లయ్‌ అధికారులు, రైస్‌ మిల్లర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ హరిసింగ్‌, డీఎస్‌ఓ మోహన్‌బాబు, జిల్లా సివిల్‌ సప్లయ్‌ మేనేజర్‌ శ్రీధర్‌రెడ్డి, రైస్‌ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement
 
Advertisement
Advertisement