జిల్లాలో ఉపాధి పనులు ఇలా..
మద్దిరాలలో అత్యధికం
భానుపురి (సూర్యాపేట) : గ్రామీణ ప్రాంత కూలీలు ఉపాధి హామీ పనుల బాట పడుతున్నారు. వారం రోజుల క్రితం వరకు ఉపాధి పనులపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ఏ గ్రామ పంచాయతీలో చూసినా 50 మందికి మించి పనులకు హాజరు కాలేదు. ప్రస్తుతం వ్యవసాయ పనులు మందగించడంతో ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెరుగుతోంది. ఉపాధి కూలీల సంఖ్యను పెంచేందుకు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ 10 రోజులుగా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. పని ప్రదేశంలో నీడ, మంచినీరు వంటి వసతులు కల్పించాలని, ప్రతి గ్రామపంచాయతీలో కనీసం 100 మంది కూలీలు పనులకు హాజరయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు చర్యలు చేపట్టడంతో కూలీల సంఖ్య కూడా పెరుగుతోంది. ఎండల తీవ్రత అధికంగా ఉన్నా.. ఉదయం 6 గంటలకే పనులు మొదలవుతుండడంతో కూలీలు ఆసక్తి చూపుతున్నారు. పనులకు వెళ్లిన వారికి మంచి కూలి పడుతుండడంతో మిగతా వారు సైతం ఇటువైపుగా వస్తున్నారు.
జిల్లాలో 1,66,707 జాబ్‌కార్డులు
సూర్యాపేట జిల్లాలో మొత్తం 1,66,707 జాబ్ కార్డులు ఉన్నాయి. 2026–27 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని కూలీలకు సుమారు 20,86,820 పనిదినాలు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యాన్ని నిర్దేశించాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని వీక్షిత్ భారత్ – రోజ్‌గార్, ఆజీవికా మిషన్ (వీబీ–జీ రామ్‌జీ)గా మార్చింది. గతంలో ఈ పథకం కింద కూలీల హాజరు కోసం ఉన్న నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్‌ఎంఎంఎస్) యాప్‌ను ఉన్నతీకరించింది. దాంతో కూలీలు ఉదయం పని మొదలు పెట్టే ముందు ఒకసారి, తర్వాత 4 గంటలకు మరోసారి ఫొటోలు దిగాల్సి ఉంటుంది. అప్పుడే కూలీల వేతనం నేరుగా వారి అకౌంట్లలో జమ అవుతుంది.
వ్యవసాయ పనులు లేక..
సూర్యాపేట జిల్లాలో 4.80 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వరికోతలు ముగియడంతో రైతులంతా ధాన్యం అమ్మకం, వరిగడ్డి సేకరణ పనుల్లో నిమగ్నమయ్యారు. భూమిలేని కూలీలు మిరపచేను ఏరేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులన్నీ ముగిశాయి. ధాన్యం అమ్మకాలు చివరి దశకు చేరగా, మిరప చేనులు ఏరడం కూడా అయిపోయింది. దాంతో కూలీలంతా ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత నెల 29న జిల్లావ్యాప్తంగా 28,335 మంది కూలీలు పనులకు హాజరు కాగా బుధవారం 43,667 మంది హాజరయ్యారు. వారం రోజుల్లోనే 15,332 మంది కూలీలు పెరిగారు. జిల్లాకు అధికారులు నిర్ధేశించిన లక్ష్యంలో ఇప్పటి వరకు కేవలం 17.56 శాత కూలీలకు మాత్రమే పనులు కల్పించారు. ఇప్పటి వరకు జిల్లాలో 3,66,438 పని దినాలను పూర్తి చేశారు.
జాబ్‌కార్డులు : 1,66,707
పనిదినాల లక్ష్యం : 20,86,820
ఇప్పటి వరకు
కల్పించిన పనిదినాలు : 3,66,438
ప్రతి గ్రామపంచాయతీకి
సగటున : 84 మందికి
ఫ ఉపాధిహామీ పనులకు
పెరుగుతున్న హాజరుశాతం
ఫ వ్యవసాయ పనులు లేక కూలికి
ఫ మండుటెండను సైతం
లెక్కచేయకుండా కూలీల రాక
ఫ బుధవారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా
43,667 మంది హాజరు
జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉపాధిహామీ పనులకు కూలీల హాజరు శాతం పెరుగుతుండడంతో రానున్న రోజుల్లో పనిదినాలు కూడా అధికం కానున్నాయి. మరో నెలరోజుల పాటు పనులను కల్పించేందుకు వీలుగా జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామపంచాయతీకి సగటున రోజుకు 84 మంది కూలీలకు పనులు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో అత్యధికంగా మద్దిరాల మండలంలో గ్రామపంచాయతీకి సగటున 139 మందికి, ఆత్మకూర్ (ఎస్) మండలంలో 127, నూతనకల్‌లో 123 మందికి చొప్పున పనులను కల్పిస్తున్నారు. అత్యల్పంగా పాలకీడు మండలంలోని గ్రామపంచాయతీల్లో కేవలం 38 మందికి మాత్రమే పనులు కల్పిస్తున్నారు.


