నడిగూడెం : నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆధునీకరణ పనులు ఈ ఏడాది చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు. సాగర్ ఎడమ కాల్వ నడిగూడెం మండల పరిధిలో.. కృష్ణానగర్ డీప్‌కట్ (119 కిలో మీటరు) నుంచి రామాపురం, చాకిరాల, సిరిపురం గ్రామాల మీదుగా కాగితరామచంద్రాపురం వరకు (132 కిలో మీటరు వరకు) ఉంది. ఈ కాల్వ క్రింద ఎల్–33, ఎల్–34, ఎల్–35, ఎల్–36 ఎత్తిపోతల పథకాలతో పాటు, కొమరబండ మేజరు, కొత్తగూడెం మేజరు, పాలారం మేజరు కాల్వలున్నాయి. వీటి కింద నడిగూడెం మండలంతో పాటు, అనంతగిరి, కోదాడ మండలాలకు ఆయకట్టు విస్తరించి ఉంది. అయితే, రామాపురం, చాకిరాల, సిరిపురం, కాగితరామచంద్రాపురం గ్రామాల సమీపాన పలు చోట్ల కాల్వ లైనింగ్ దెబ్బతిన్నది. కొన్ని చోట్ల కాల్వ కట్ట బలహీనంగా మారింది. సిరిపురం డీప్‌కట్ సమీపాన కాల్వ కట్టకు వర్షపు నీటితో లోతైన బుంగలు ఏర్పడ్డాయి. గతంలో 2008 సంవత్సరం నుంచి 2016 సంవత్సరం వరకు సాగర్ ఎడమ కాల్వకు ప్రపంచ బ్యాంకు నిధులతో ఆధునీకరణ పనులు చేపట్టారు. కానీ, అప్పట్లో పలు చోట్ల కాల్వ కట్ట బాగుండంతో ఆ ప్రాంతాలలో పనులు చేపట్టలేదు. దీంతో నేడు ఆ కాల్వ కట్టలు బలహీనమై ప్రమాదకరంగా మారాయి. లైనింగ్ దెబ్బతిన్నది. ఎలాంటి ప్రమాదం జరగకముందే మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
రెండేళ్ల క్రితం భారీగా గండ్లు
2024 సెప్టెంబరులో భారీ వర్షాలు కురవడంతో పాలేరు రిజర్వాయర్ వెనుక జలాలు సాగర్ కాల్వలోకి రావడంతో రెండు చోట్ల గండ్లు పడి కాల్వ తెగిపోయింది. కాగితరామచంద్రాపురం సమీపాన 132 కిలోమీటరు వద్ద, ఖమ్మం జిల్లా పరిధిలో 133 కిలో మీటరు వంతెన వద్ద గండ్లు పడడంతో నడిగూడెం, అనంతగిరి మండలాలతో పాటు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో వందల ఎకరాలు పంట పొలాలు నీట మునిగాయి. అప్పుడు ప్రభుత్వం అత్యవసరంగా రూ.2.10 కోట్లు నిధులు మంజూరు చేసి, యుద్ధ ప్రాతిపదికన కట్టకు పడిన గండ్లను తాత్కాలికంగా పూడ్చివేశారు. ప్రభుత్వం స్పందించి సాగర్ కాల్వ లైనింగ్ దెబ్బతిన్న ప్రాంతంలో శాశ్వత మరమ్మతులు చేపట్టాలని, వర్షా కాలం లోపే పనులు మొదలుపెట్టాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
దెబ్బతింటున్న తూములు
నడిగూడెం మండల పరిధిలోని చాకిరాల 123 కిలో మీటరు వద్ద కొత్తగూడెం మేజరు తూము, కాగితరామచంద్రాపురం వద్ద ఉన్న మాధారం తూములకు ఏళ్ళ తరబడి మరమ్మతులు లేకపోవడంతో దెబ్బతింటున్నాయి. తూముల వెంట ఉన్న కట్ట లైనింగ్ దెబ్బతిని కోతకు గురవుతోంది.
నిధులు మంజూరైన వెంటనే
పనులు చేపడతాం
కాగితరామచంద్రాపురం సమీపాన 132 కిలో మీటరు వద్ద శాశ్వత పనులు చేసేందుకు రూ.1.36 కోట్లు అంచానాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాము. నిధులు మంజూరైన వెంటనే పనులు చేపడుతాము. మిగతా చోట్ల కాల్వ కట్టల మరమ్మతు అంశం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. రామాపురం వద్ద కొమరబండ మేజరు కాల్వ తూముకు రూ.74.75 లక్షలతో శాశ్వతంగా కొత్త తూము నిర్మిస్తున్నాం. రెండు నెలల్లో పనులు పూర్తవుతాయి.
– రఘు, నీటి పారుదల శాఖ డీఈ
ఫ గతంలో కాల్వ తెగి వందల
ఎకరాల్లో మునిగిన పంట
ఫ అప్పట్లో తాత్కాలికంగానే మరమ్మతు
ఫ కాల్వ ఆధునీకరణ పనులు
చేపట్టాలని రైతుల వినతి
ఫ వర్షాకాలం సమీపిస్తున్నా
పనుల ఊసే లేదు


