సూర్యాపేట అర్బన్ : జనగణనలో భాగంగా ఆన్‌లైన్‌లో స్వీయ గణన చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరుతూ బుధవారం జిల్లా కేంద్రంలో మారథాన్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన అనంతరం చైర్ పర్సన్ మీడియాతో మాట్లాడుతూ స్వీయ గణన ద్వారా ప్రజలు తమ వివరాలను స్వయంగా, ఖచ్చితత్వంతో నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 10వ తేదీ లోపు ఆన్‌లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా కుటుంబం వివరాలను నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, ఆర్డీఓ ఆర్. వేణు మాధవరావు, సీపీఓ ఎల్.కిషన్, సెన్సెస్ జిల్లా ఇన్‌చార్జి ఇస్లావత్ హోబాలాల్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ పెండెం వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ సీహెచ్. హనుమంతరెడ్డి, కలెక్టర్ కార్యాలయ, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది, ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.


