అనంతగిరి : తల్లిదండ్రులు లేని, వదిలివేయబడిన పిల్లలకు మిషన్ వాత్సల్య పథకం వరం లాంటిదని బాలల పరిరక్షణ కోదాడ ప్రాజెక్ట్ అధికారి విద్యాసాగర్ అన్నారు. బుధవారం అనంతగిరి మండల కేంద్రంలోని గ్రామపంచాయితీ కార్యాలయంలో బుధవారం బాలల పరిరక్షణ విభాగం, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామ స్థాయి బాలల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మిషన్ వాత్సల్య పథకం, బాలల చట్టాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మిషన్ వాత్సల్య పథకం కింద నెలకు రూ.4వేలతో పాటు రక్షణ, సంరక్షణ అవసరమైన పిల్లలకు బాలల హోమ్స్‌లో ఆశ్రయం కల్పించనున్నట్లు తెలిపారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రజిని మాట్లాడుతూ.. బాల్యవివాహాలు చేయడం నేరమని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ నకిరికంటి వీరభద్రమ్మ, ఉసర్పంచ్ గవిని రామకృష్ణ యాదవ్, ఏఎస్‌ఐ లింగారెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీవిద్య, అంగన్‌వాడీ టీచర్లు సుగుణమ్మ, నర్సమ్మ, ఆశా కార్యకర్త, గర్భిణులు, బాలింతలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.


