భానుపురి (సూర్యాపేట) : రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు. మొదటి విడత ఇళ్లు జిల్లాలో ముమ్మరంగా సాగుతుండగా.. ఏప్రిల్ మాసంలో రెండో విడత ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్ సమావేశాల్లోనూ నిర్మాణ శాఖకు నిధులు కేటాయించింది. అయితే ఈ నెల ముగియవస్తుండగా ఇంతవరకు ఇళ్ల మంజూరు పై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది.
ఎలాంటి నిర్ణయం రాక
ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిన సమయంలో 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల మధ్యలోనే ఈ నిర్మాణం ఉండాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలతో చాలామంది తమకు బిల్లులు వస్తాయా..? ఈ ఇల్లు సరిపోతుందో లేదోనన్న అనుమానాలతో మొదట్లో ఇంటి నిర్మాణానికి ముందుకు రాలేదు. నిర్మాణాలు జరిగిన చోట ఇళ్లను చూసిన లబ్ధిదారులు ఇవి బాగున్నాయని.. బిల్లులు వెనువెంటనే వస్తున్నాయని చెప్పి ఇంటి నిర్మాణాలకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే మొదటి విడతలో ఇళ్లురాని అర్హులైన దరఖాస్తుదారులు రెండో విడతలోనైనా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకోవాలని భావించారు. ప్రభుత్వం కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ మొదట్లోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను ప్రకటిస్తామని చెప్పగా వీరంతా ఆనందపడ్డారు. తదనంతరం ఈ నెలాఖరు నాటికి ఇస్తామని మంత్రులు ప్రకటించగా ఇప్పటివరకు దీనిపై ఎలాంటి నిర్ణయాలు వెలువడలేదు. అధికారికంగా జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో రెండో విడతపై ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
మొదటి విడత ముమ్మరంగా..
ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం 12,868 ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హులను గుర్తించి 8,252 మందికి ప్రొసీడింగ్ కాపీలు అందించారు. ఈ ఇళ్లు ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నాయి. 1,500 ఇళ్లకు పైగా గృహప్రవేశాలు జరగగా మే నెల వరకు మరో 1,500 ఇళ్లను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం కేటాయించిన ఇళ్లలో 4616 నిర్మాణాలు వివిధ కారణాలతో ఇంకా ప్రారంభం కాలేదు.
ఇందిరమ్మ ఇళ్లపై వీడని ఉత్కంఠ
ఏప్రిల్‌లో ఇస్తామని అసెంబ్లీ
సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటన
కానీ మాసం ముగియవస్తున్నా
రాని ఆదేశాలు
దరఖాస్తుదారులకు ఎదురుచూపులు


