ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ హెచ్చరించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశంలో ఎస్పీ నరసింహతో కలిసి పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఉన్నఆరు ఇసుక రిచ్‌లలో అక్రమంగా ఇసుక రవాణా చేసే వాహనాలు పట్టుబడితే బైండోవర్ కేసులు నమోదు చేసి జరిమానా విధించాలని ఆదేశించారు. ప్రతి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో ఇసుక అందించేందుకు ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలన్నారు. పోలీస్, రెవెన్యూ, మైనింగ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఒక మొబైల్ టీం ఏర్పాటు చేసి అక్రమంగా ఇసుక రవాణాను అడ్డుకోవాలన్నారు. జిల్లాలో 729 ఆమోదం పొందిన ఇసుక ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు అంటించాలని, సీసీ, ఏఎన్పీఆర్ కెమెరా పర్యవేక్షణతో పాటు ప్రతి సాండ్ టాక్సీ రీచ్‌లో 24 గంటల పర్యవేక్షణ కోసం హై–ఎండ్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఏదైనా అనధికార వాహనం కెమెరాలో గుర్తిస్తే ఆ వాహనాన్ని బ్లాక్ చేయాలన్నారు. సీసీ కెమెరాతో అమర్చబడిన మొబైల్ వాహనం ద్వారా రీచ్ పరిసర ప్రాంతాలలో నిరంతరం సంచరిస్తూ అక్రమ ఇసుక రవాణాను తక్షణమే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. తహసీల్దార్లు వారానికి కనీసం రెండు సార్లు రీచ్‌లను సందర్శించాలని, ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 1 నుంచి ఇసుక సరఫరాకు మాన్యువల్ ఉండదని ఆన్ లైన్ ట్రాన్సిస్ట్ పాస్ సిస్టమ్ (ఓటీపీఎస్), మన ఇసుక వాహనం ద్వారా ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవాలని, గ్రామపంచాయతీ సెక్రటరీ ఇసుక ఎంత కావాలో నిర్ధారిస్తే, సంబంధిత తహసీల్దార్ పర్యవేక్షణలో ఆన్‌లైన్ ద్వారా నమోదు చేస్తారని కలెక్టర్ వెల్లడించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, రెవెన్యూ డివిజనల్ అధికారి వేణు మాధవరావు, మైనింగ్ ఏడీ విజయ రామారావు, డీపీఓ యాదగిరి, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి బాలు పాల్గొన్నారు.
బీఈడీ ఫలితాలు విడుదల
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ ఒకటి, మూడవ సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. మొదటి సెమిస్టర్‌లో 2,601 మందికి 1,982 మంది ఉత్తీర్ణత సాధించారు. 619 మంది ప్రమోటయ్యారు. మూడో సెమిస్టర్‌లో 2,713 మంది విద్యార్థులకు 2,440 మంది ఉత్తీర్ణులయ్యారు. 269 మందిప్రమోటయ్యారు.


