రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొనసాగుతున్న సంక్షేమ పధకాలకు తోడుగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఈ బడ్జెట్‌లో ప్రవేశపెట్టింది. ఇందులో కుటుంబ పెద్ద ఏదైనా కారణంతో మృతిచెందితే రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నారు. ఈ పథకం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లాలో 2,38,464 కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది.
ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు బ్రేక్ ఫాస్ట్ స్కీంను ప్రభుత్వం అమలు చేయనుంది. విద్యార్థులకు వారంలో మూడు రోజుల పాటు పాలు, మరో మూడు రోజులు రాగి జావ ఇవ్వనున్నారు. అలాగే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని సైతం అమలు చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమలు కానుండగా.. జిల్లాలో 2వేల మందికి పైగా ఇంటర్ విద్యార్థుల ఆకలి తీరనుంది.


