మరిపెడ రూరల్: ఆటోను కారు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని పురుషోత్తమాయగూడెం శివారు సీతారాంపురం స్టేజీ వద్ద మహబూబాబాద్–సూర్యాపేట 365 జాతీయ రహదారిపై శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పురుషోత్తమాయగూడెం గ్రామానికి చెందిన పిట్టల శ్రీనివాస్ కుటుంబం ఓ శుభకార్యం నిమిత్తం ఆటోలో మహబూబాబాద్‌కు బయల్దేరింది. ఈ క్రమంలో సీతారాంతండా స్టేజీ సమీపంలో మహబూబాబాద్ నుంచి అతివేగంగా వస్తున్న కారు ఆటోను ఎదురుగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న రామస్వామి వెంకన్న (55) మృతి చెందగా, మరో ఆరుగురు.. పిట్టల శ్రీనివాస్, పిట్టల పద్మ, గాలి గిరి, గాలి అరుణ, కేసరి శేషమ్మ, ఆటో డ్రైవర్ రవీందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పిట్టల పద్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిలో ఐదుగురిని మానుకోటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, ఇద్దరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషయంగా ఉన్న పిట్టల పద్మను ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతుడు రామస్వామి వెంకన్నది సూర్యాపేట కాగా, శుభకార్యానికి బంధువుల ఇంటికి వచ్చి మృత్యువాత పడ్డాడు. మరిపెడ పోలీసులు ప్రమాదస్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ యాస రవి, చంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
● ఒకరి మృతి, ఆరుగురికి తీవ్రగాయాలు


