అక్రమ రవాణాపై పటిష్ట నిఘా
గురువారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2026
సూర్యాపేటటౌన్ : అక్రమ రవాణా, అసాంఘిక చర్యలపై పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డితో కలిసి జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ పోలీసు అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సామాజిక రక్షణ, శాంతి భద్రతల అంశాలు, చట్టాల అమలు, సామాజిక భద్రతలో పౌరుల బాధ్యత, రోడ్డు ప్రమాదాల నివారణ, యువత భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.
సోదరభావంతో నిర్వహించుకోవాలి
ఉగాది, రంజాన్ పండుగను ప్రజలందరూ సోదరభావంతో నిర్వహించుకోవాలని ఎస్పీ నరసింహ కోరారు. జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ తరపున ఎస్పీ నరసింహ బుధవారం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
భానుపురి (సూర్యాపేట) : వేసవి తాగునీటి ప్రణాళికలు ఖరారయ్యాయి. రానున్న మూడు నెలల పాటు ప్రజలకు మంచినీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది. జిల్లా యంత్రాంగం గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి మాసంలోనే ప్రణాళికలను రూపొందించే పనిలో పడింది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మిషన్ భగీరథ అధికారులు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో తాగునీటి వనరుల వివరాలను సర్వే ఆధారంగా నమోదు చేసుకున్నారు. ఈ మేరకు 2,662 పనులకు గాను రూ.6.46 కోట్లు అవసరమవుతాయని భావించి తాగునీటి ప్రణాళిక తయారు చేశారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 486 గ్రామ పంచాయతీలు, 836 ఆవాసాలు ఉన్నాయి. దాదాపు 2.28 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఏటా గ్రామాల్లో వేసవి కాలంలో మంచినీటి సమస్య తలెత్తుతోంది. దీన్ని నివారించేందుకు గాను వివిధ శాఖల ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. తాగునీటి వనరుల మరమ్మతులకు పంచాయతీ నిధులనే వెచ్చించనున్నారు. ఇందుకు రూ.6.42 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఆయా గ్రామాల్లో సింగిల్, త్రీఫేజ్ మోటార్లకు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావడంతో పాటు నీరు తక్కువగా పోస్తున్న బోరు బావులకు ప్రెషింగ్ చేయించాలని నిర్ణయించారు. గ్రామాల్లో పైపులైన్ల లీకేజీలకు వెంటనే మరమ్మతులు చేయించాలని ప్రణాళికలో పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లోని చేతి బోర్లను కూడా బాగుచేయించాలని ప్రతిపాదనలు పంపించారు.
అవసరాన్ని బట్టి అద్దె బోర్లు
ఆయా గ్రామాల్లో అవసరమైన చోట అద్దె బోర్లను మాట్లాడుకోవాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం యాసంగి పంటల సాగుకు నీటి అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. మరో నెల తర్వాత పంటలు కోత దశకు వస్తాయి. అప్పుడు నీటి అవసరం తగ్గుతుంది. భూగర్భజలాలపై ఒత్తిడి తగ్గుతుంది. ఈ సమయంలో రైతుల నుంచి అద్దె బోర్లను మాట్లాడుకోవాలని నిర్ణయించారు. ఈ ప్రణాళిక మేరకు అన్నిరకాల సామాగ్రిని కొనుగోలు చేయడంతో పాటు రైతుల నుంచి అద్దె బోర్లు తీసుకుని ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గుర్తించిన పనులను పూర్తి చేయాలని భావిస్తున్నారు.
కోదాడ: వాయిదా పడిన కోదాడ పబ్లిక్‌క్లబ్ ఎన్నికలు తిరిగి ఈ నెల 29న నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న న్యాయవాది ఎస్‌ఆర్‌కే మూర్తి బుధవారం క్లబ్ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నామినేషన్‌లు ఉపసంహరించుకోవడానికి ఈ నెల 24వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు సమయం ఉందని తెలిపారు. 25న పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని, 29వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరిపి వెంటనే ఫలితాలను ప్రకటిస్తామని ఆయన వివరించారు. సభ్యులు సకాలంలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
సర్వేలో గుర్తించిన అంశాలు
సమస్య ప్రాంతాలు నిధులు(రూ.లలో)
చేతిపంపు రిపేర్లు 420 1.07 కోట్లు
సింగిల్ ఫేజ్ బోరు మోటార్లు 23 12.50 లక్షలు
త్రీ ఫేజ్ బోరు మోటార్లు 83 55.09 లక్షలు
పైప్‌లైన్ లీకేజీలు 488 1.29 కోట్లు
నీటిట్యాంకుల మరమ్మతులు 188 56.76 లక్షలు
ఇంటినల్లాలు బిగించాల్సింది 1460 2.85 కోట్లు
మొత్తం 2662 6.46 కోట్లు


