● సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు
సూర్యాపేట : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం ఆపాలని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఇరాన్‌పై యుద్ధం మూలంగా దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిందన్నారు. ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయి రాబోయే రోజుల్లో చమురు, డీజిల్, పెట్రోల్ దొరకకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. బుధవారం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం నాలుగవ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని విజయ్ కన్వెన్షన్ హాల్‌లో సీపీఎం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు – దాని పర్యవసానాలు’ అంశంపై జరిగిన సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌పై 60 రూపాయలు పెంచిందని, మోదీ ప్రభుత్వం దేశ ప్రయోజనాల కన్నా ఇరాన్‌పై యుద్ధానికే ప్రాధాన్యత ఇస్తుందని విమర్శించారు. ఖనిజాలు, సహజ వనరులపై, ఆయిల్ నిల్వలపై కన్నేసిన అమెరికా.. ఇరాన్‌ను ఎలాగైనా తన దారిలోకి తెచ్చుకొని అక్కడున్న ఆయిల్ నిల్వలను కొల్లగొట్టాలనే దురుద్దేశంతోటే ఇజ్రాయిల్‌తో కలిసి దాడులకు పాల్పడిందన్నారు. ఇజ్రాయిల్, అమెరికా కలిసి పాలస్తీనాను స్మశానంగా మార్చాయని, ఇప్పుడు ఇరాన్‌పై గురిపెట్టాయన్నారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం యుద్ధాలు చేసి సాధారణ ప్రజలను హతమార్చడం అన్యాయమని పేర్కొన్నారు. ఎంతో కాలంగా భారతదేశానికి మిత్ర దేశంగా కొనసాగుతున్న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడి చేసినా భారత ప్రభుత్వం నోరు మెదపకుండా ఉండడం అన్యాయమన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వీరనారి మల్లు స్వరాజ్యం జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్‌లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ములకలపల్లి రాములు, నాగారపు పాండు, పారేపల్లి శేఖర్‌రావు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి తదితరులు పాల్గొన్నారు.
భూ సమస్యల పరిష్కారానికి రీ సర్వే
నూతనకల్: భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు భూముల రీసర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా సహాయ సంచాలకుడు, సర్వే, ల్యాండ్ రికార్డుల అధికారి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం నూతనకల్ మండల పరిధిలోని యడవెల్లి, పెద నెమిల గ్రామాల్లో భూ భారతి భూముల రీసర్వే కార్యక్రమంపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎం. శ్రీనివాసరావు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ ప్రకాష్, సర్పంచ్‌లు చురుకంటి లావణ్య మధుసూదన్‌రెడ్డి, జటంగి సరితకృష్ణ, ఆర్‌ఐ హాసన్ పాల్గొన్నారు.


