పెద్దవూర : బత్తాయి రైతులు సేంద్రియ సాగుతో లాభాల బాట పట్టవచ్చని రిటైర్డ్ వ్యవసాయ శాస్త్రవేత్త ఆరీఫ్‌ఖాన్ తెలిపారు. బుధవారం పెద్దవూర మండలం పర్వేదుల రైతు వేదికలో బత్తాయి సాగుపై రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విచ్చలవిడిగా రసాయన మందులు, ఎరువులు వాడటం వలన భూమిలో సారం తగ్గి, సాగు ఖర్చులు పెరిగి, సరైన దిగుబడి రాక బత్తాయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీనిని అదిగమించేందుకు ప్రతి రైతు సేంద్రియ పద్ధతిలో బత్తాయి సాగు చేయాలని కోరారు. ముఖ్యంగా జీవ ఎరువులైన ట్రైకోడెర్మా విరిడి, సూడోమొనాస్, పిఎస్‌బి, కెఎస్‌బి, వేస్ట్ కంపోజర్ తదితర కల్చర్‌లను క్షేత్రస్థాయిలోనే తయారు చేసుకుని బత్తాయి తోటలకు వాడుకోవాలని సూచించారు. దీంతో భూమిలో మేలైన బ్యాక్టీరియా పెరిగి మొక్కలకు చీడపీడలను తట్టుకునే శక్తి వస్తుందని తెలిపారు. అనంతరం అనుముల క్లస్టర్ ఉద్యానవన అధికారి కె. మురళి మాట్లాడుతూ.. రైతులు నాణ్యమైన బత్తాయి మొక్కలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఉద్యానశాఖ ద్వారా అందిస్తున్న పథకాలను రైతులకు వివరించారు. మండల వ్యవసాయాధికారి సందీప్‌రెడ్డి మట్లాడుతూ.. రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం కూరగాయలు సాగు చేసే రైతులకు వెజిటెబుల్ మినీ కిట్స్ అందజేశారు. సమీపంలోని బత్తాయి తోటలోకి వెళ్లి బత్తాయి చెట్లకు వచ్చిన తెగుళ్లను పరిశీలించి, వాటి నివారణకు పలు సూచనలు చేశారు. పెద్దవూరలో మిట్టపల్లి శ్రీనివాస్ సమీకృత సేంద్రీయ పద్ధతిలో సాగుచేస్తున్న ఆయిల్ ఫామ్, మునగ, పుచ్చ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎరీస్ కంపెనీ ప్రతినిధి నాగేశ్వర్‌రావు, బత్తాయి అభ్యుదయ రైతు కట్టెబోయిన శ్రీనివాస్‌యాదవ్, ఉద్యాన విస్తరణ అధికారులు రాంప్రసాద్, జనార్దన్‌రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు రవిచందర్, దేవ, రైతులు పాల్గొన్నారు.
రైతులకు అవగాహన కల్పించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు


