● మోత్కూరులో ఏటా
కొనసాగుతున్న సంప్రదాయం
● నేడు బోనాలు, ఎడ్ల బండ్లతో
నూతన తెలుగు సంవత్సరాదికి స్వాగతం పలకనున్న ప్రజలు
మోత్కూరు: ఉగాది పండుగను ఏటా మోత్కూరు పట్టణంలో ప్రజలు ప్రత్యేకంగా జరుపుకుంటారు. డప్పు చప్పుళ్లు.. పూనకాలతో వీధి వీధి నుంచి బయలుదేరే బోనాలు ఓ పక్క.. రంగు రంగుల పూలు, కాగితాలు, కొబ్బరి మట్టలతో అలంకరించిన ఎడ్ల బండ్లు, కార్లు, ట్రాక్టర్లు మరో పక్క వేగంగా పరుగెత్తుతుండగా నూతన తెలుగు సంవత్సరాదికి స్వాగతం పలకడం చాలా కాలంగా వస్తున్న ఆచారం.తెలుగు నూతన సంవత్సరం మొదటి రోజైన ఉగాది పండుగకు ఎక్కడున్నా మోత్కూరుకు వెళ్లాల్సిందేనని స్థానిక ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా మోత్కూరులో విభిన్న రీతిలో ఉగాది పండుగ జరుపుకుంటారు. పూర్వ కాలంలో ఇక్కడ వేసవిలో మశూచి సోకి పలువురు చనిపోయే వారు. దీంతో గ్రామంలో కొలువై ఉన్న ముత్యాలమ్మ తల్లి ఆగ్రహానికి గురయ్యారని గ్రామస్తులు భావించారు. ఉగాది పండుగ రోజున అమ్మ వారికి ఊరు ఊరంతా డప్పు చప్పుళ్లతో బోనాలు సమర్పించి, జంతువులను బలిఇచ్చి శాంతింపజేయడంతో మశూచి మాయమైనట్లు పలువురు పెద్దలు తెలిపారు. నాటి నుంచి ఇప్పటి వరకు అదే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. మహిళలు నూతన వస్త్రాలు ధరించి బోనాలతో పట్టణంలో ప్రదర్శన నిర్వహిస్తారు. ఎడ్ల బండ్లకు ఆకు పచ్చని కొబ్బరి మట్టలు, మామిడి తోరణాలు కట్టి ఊరేగింస్తారు. ఎడ్ల బండ్లు, బోనాలతో ప్రదర్శన నిర్వహించిన అనంతరం స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రదర్శనలు చేయిస్తారు. అనంతరం స్థానిక చెరువు కట్టపై కొలువై ఉన్న పెద్దమ్మ తల్లి, అంగడి బజార్‌లో ఉన్న చిన్న ముత్యాలమ్మ తల్లి ఆలయాలకు ఊరేగింపుగా వెళ్లి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు నిర్వహిస్తారు. ద్విచక్ర వాహనదారులు, యువకులు ఆనందోత్సాహాలతో విన్యాసాలు ప్రదర్శిస్తారు.


