ట్రిపుల్‌ ఐటీ పిలుస్తోంది | - | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఐటీ పిలుస్తోంది

Mar 18 2026 7:36 AM | Updated on Mar 18 2026 7:36 AM

దరఖాస్తులు ప్రారంభం : 2026 మార్చి 18

చివరి తేదీ : 2026 మే 10

ఎంపిక జాబితా ప్రకటన : 2026 మే 30

మొదటి విడత కౌన్సిలింగ్‌ : 2026 జూన్‌ 05

పెద్దవూర : తెలంగాణలోని బాసర, మహబూబ్‌నగర్‌ ట్రిపుల్‌ ఐటీల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు గాను నోటిఫికేషన్‌ విడుదలైంది. బాసర ట్రిపుల్‌ ఐటీలో 1500 సీట్లు, మహబూబ్‌నగర్‌ ట్రిపుల్‌ ఐటీలో 180 సీట్లు కేటాయించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీల్లో ఆరేళ్ల బీటెక్‌ సమీకృత కోర్సులో చేరేందుకు www.rgukt.ac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.450, ఓసీ, బీసీ విద్యార్థులు రూ.500, ఇతర రాష్ట్రాల విద్యార్థులు రూ.1500, ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులు 100 యూఎస్‌ డాలర్లు ప్రవేశ రుసుం చెల్లించాలి.

రిజర్వేషన్లు ఇలా..

ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6, బీసీ–ఎ 7, బీసీ–బి 10, బీసీ–సి 1, బీసీ–డి 7శాతం, బీసీ–ఈ 4 శాతం, ప్రత్యేక కేటగిరీలో దివ్యాంగులకు 3 శాతం, ఈడబ్ల్యూఎస్‌ 10 శాతం, సైనికోద్యోగుల పిల్లలకు 2, ఎన్‌సీసీ విద్యార్థులకు 1, స్పోర్ట్స్‌ కోటా కింద 0.5 శాతం సీట్లు భర్తీ చేస్తారు. వేరే రాష్ట్రాల వారికి, భారతీయ పౌరసత్వం కలిగిన అంతర్జాతీయ విద్యార్థులకు, గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు అదనపు సీట్లు కేటాయిస్తారు. అన్ని విభాగాల్లో బాలికలకు 33.33శాతం రిజర్వేషన్‌ ఉంటుంది.

ప్రవేశ విధానం..

పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్‌ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రభుత్వం, నాన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, ఇతర జెడ్పీహెచ్‌ఎస్‌లలో చదివిన విద్యార్థులకు 4 శాతం మార్కులు(ప్రతి సబ్జెక్టుకు 4 మార్కులు మొత్తం 24 మార్కులు) విద్యార్థికి వచ్చిన పదో తరగతి మార్కులకు కలిపి ప్రవేశాల్లో ప్రాధాన్యత కల్పిస్తారు.

మార్కులు సమానమైతే..

ఒక వేళ పదో తరగతిలో విద్యార్థులకు సమాన మార్కులు వస్తే మొదట గణితం, తర్వాత జనరల్‌ సైన్స్‌, ఆ తర్వాత ఇంగ్లిష్‌, సోషల్‌ స్టడీస్‌లో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఇవన్నీ కూడా సమానంగా ఉంటే ఫస్ట్‌ లాంగ్వేజీలో వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. అయినా కూడా మార్కులు సమానమైతే విద్యార్థి పుట్టిన తేదీ ప్రకారం పెద్ద వయస్సు ఉన్నవారికి అవకాశం ఇస్తారు. ఇవీ సమానంగా ఉంటే హాల్‌టికెట్‌ నంబర్‌ను పరిగణలోకి తీసుకుని ఫైనల్‌ లిస్ట్‌కు ఎంపిక చేస్తారు.

ఫీజుల వివరాలు..

● మొదటి రెండేళ్లు ఏడాదికి రూ.36వేలు, ఆ తర్వాత నాలుగేళ్లు ఏడాదికి రూ.40వేల చొప్పున చెల్లించాలి.

● ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకానికి అర్హులైలే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

● ఇతర రాష్ట్రాలు, గల్ఫ్‌ దేశాల్లో పనిచేసే వారి పిల్లలు ఏడాదికి రూ.1.37 లక్షలు, ఎన్నారై విద్యార్థులు రూ.3,01,000 ట్యూషన్‌ ఫీజు చెల్లించాలి.

అన్నీ ఉచితమే..

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వమే అన్నీ ఉచితంగా అందజేస్తుంది. ల్యాప్‌టాప్‌, మూడు జతల షూ, హాస్టల్‌లో అవరమైన వస్తువులను ప్రభుత్వమే సమకూర్చుతుంది.

బాసర, మహబూబ్‌నగర్‌ క్యాంపస్‌లలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల

స్వీకరణ

మే 10వ తేదీ వరకు అవకాశం

పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు సువర్ణావకాశం

అర్హతలు ఇవీ..

2026లో నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ, తత్సమాన పరీక్షల్లో రాష్ట్రంలో గుర్తింపు పొందిన పాఠశాలలో రెగ్యులర్‌గా ఉత్తీర్ణులై ఉండాలి. 2025 డిసెంబర్‌ 31 నాటికి 18 ఏళ్లు నిండకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 21 ఏళ్లు నిండకూడదు. బాసర, మహబూబ్‌నగర్‌ ట్రిపుల్‌ ఐటీలలో మొత్తం 1680(1500+180) సీట్లకు గాను 85శాతం సీట్లు తెలంగాణ వాసులకే కేటాయించారు. మిగతా 15శాతం సీట్లు ఓపెన్‌ కేటగిరీలో ఇతర రాష్ట్రాల మెరిట్‌ విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement