● ఎదిగిన ఆయిల్‌పామ్ తోటలకు నెలకు ఎకరాకు 5 కిలోల యూరియా, 3 కిలోల డీఏపీ, 5 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 2.5 కిలోల మెగ్నీషియం సల్ఫేట్‌ను, ఒక కిలో బోరాక్స్‌ను విడివిడిగా నీటిలో కరిగించి ఫర్టిగేషన్ ద్వారా మొక్కలకు అందించాలి. ఇలా చేయడం వలన సమయం, ఎరువుల ఖర్చు ఆదా చేయవచ్చు.
● ఆయిల్‌పామ్ తోటల్లో ఎక్కువగా పోషక లోపాలు కనిపించినట్లైతే మట్టి, పత్ర విశ్లేషణ కొరకు నమూనాలను సిఫార్సు చేసిన రీతిలో సేకరించి విశ్లేషణ కొరకు పంపాలి.
పెద్దవూర : రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలని రైతులకు సబ్సిడీపై మొక్కలు అందించడంతో రైతులు ఆయిల్‌పామ్ అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఆయిల్‌పామ్ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు, సూచనలు అందించేందుకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో రైతులకు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. వేసవిలో సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే పంట దిగుబడిలో తగ్గి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అనుముల క్లస్టర్ ఉద్యానవన అధికారి మురళి తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఆయిల్‌పామ్ రైతులు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచిస్తున్నారు.
● ఒకటి నుంచి మూడు సంవత్సరాల వయస్సు ఉన్న ఆయిల్‌పామ్ తోటల్లో మొక్కకు మూడు అడుగుల దూరంలో జనుము, పచ్చిరొట్ట ఎరువు పంటగా నాటుకోవాలి. జనుము పూతకు వచ్చిన వెంటనే చిన్నచిన్న ముక్కలుగా కోసి పాదులో చుట్టూ వేయాలి.
● ప్రతి మొక్కకు రెండువైపులా ఒక్కో మైక్రోజెట్(30 లేదా 40 లీటర్లు డిశ్చార్జ్ అయ్యేవి) అమర్చుకోవాలి.
● వేసవిలో చిన్న మొక్కలకు రోజుకు 150–165 లీటర్ల నీటిని అందించాలి. చెట్టుకు ఇరుపక్కల జెట్‌కు గంటకు 40 లీటర్ల సరఫరా సామర్థ్యం ఉన్నట్లైతే రోజుకు రెండు గంటలు నీరు అందించాలి. ఎదిగిన ఆయిల్‌ఫామ్ తోటల్లో వేసవి కాలంలో ప్రతి చెట్టుకు రోజుకు 250–330 లీటర్ల నీటిని అందించాలి.
● మూడేళ్ల లోపు ఉన్న మొక్కల్లోని పూగుత్తులను ప్రతి నెల అబ్లెషన్ సాధనంతో రెండుసార్లు తొలగించాలి.
● అవసరం మేరకు మాత్రమే (అన్ని చెట్లు కాకుండా) ఎండిన, విరిగిన లేదా చీడపీడలు ఆశించిన ఆకులను మాత్రమే తొలగించాలి.
● ఆయిల్‌పామ్ తోటలలో అంతర పంటలు వేసినట్లయితే ఆయిల్‌పామ్ మొక్కలతో పాటు అంతర పంటలకు కూడా సిఫారసు మేరకు నీరు తప్పనిసరిగా అందేలా చూసుకోవాలి.
● ఆయిల్‌పామ్ రైతులకిచ్చిన డైరీలలో సిఫారసు చేసిన పద్ధతిలో పోషకాలను తప్పనిసరిగా అందించి అట్టి వివరాలను డైరీలలో నమోదు చేయాలి.
● ఎదిగిన ఆయిల్‌పామ్ తోటల్లో గెలలు కోసిన తర్వాత ముక్కలు చేసిన ఆయిల్‌పామ్ ఆకులను, మగ పూల గుత్తులను, మొక్కజొన్న చొప్పను, ఖాళీ అయిన ఆయిల్‌పామ్ గెలలను, పాదుల్లో మల్చింగ్‌గా పరచాలి.
● ఆయిల్‌పామ్ తోటల్లో పక్వానికి వచ్చిన ప్రతి గెలను, అల్యూమినియం కడ్డీ లేదా కత్తితో కోయాలి.


