పెద్దవూర : అధిక వడ్డీ ఆశచూపి పలువురిని మోసగించిన నలుగురు వ్యక్తులను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ బి. శ్రీనునాయక్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండలం హాజ్యతండా గ్రామ పంచాయతీ పరిధిలోని జాల్‌తండాకు చెందిన వడ్త్య భీమా అధిక వడ్డీ ఇస్తానని చెప్పి తన వద్ద డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసగించాడని పెద్దవూర మండలంలోని పాల్తీతండాకు చెందిన పాల్తి కోటేష్ ఈ నెల 7న పెద్దవూర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం వడ్త్య భీమాతో పాటు దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గిరిజానగర్‌తండాకు చెందిన నేనావత్ రమేష్, డిండి మండలం హజ్యతండా గ్రామ పంచాయతీ పరిధిలోని జాల్‌తండాకు చెందిన ఆంగోతు సురేష్, రాత్లావత్ గణేష్‌ను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.
లక్షల రూపాయలు సేకరించి పరారీ..
అయితే వడ్త్య భీమా, అతడి సహచరులు శేఖర్‌బాబు (డైరెక్టర్), నేనావత్ రమేష్(అకౌంటెంట్), ఆంగోతు సురేష్(సహాయకుడు) తదితరులు కలిసి హైదరాబాద్‌లో ఎస్‌బీవీ గ్రీన్ ఇన్‌ఫ్రా అండ్ డెవలపర్స్, బీకాయిన్ వరల్డ్ డెవలపర్స్ పేర్లతో నకిలీ ఆన్‌లైన్ ట్రేడింగ్ వెబ్‌సైట్లు ఏర్పాటు చేశారని సీఐ పేర్కొన్నారు. పెట్టుబడులపై అధిక వడ్డీ, డబ్బు డబుల్ అవుతుందని నమ్మబలికి అమాయక ప్రజలను మోసగించినట్లు తెలిపారు. ఫిర్యాదుదారుడు పాల్తీ కోటేష్ నుంచి రూ.1,94,50,000తో పాటు అదే గ్రామానికి చెందిన మరికొంత మంది నుంచి కూడా లక్షల రూపాయలు సేకరించినట్లు వివరించారు. అనంతరం కంపెనీలను మూసివేసి, సెల్‌ఫోన్లు స్విచ్చాఫ్ చేసి పరారయ్యారని పేర్కొన్నారు. తమ విచారణలో నిందితులు కుట్రపూరితంగానే నకిలీ సంస్థలను ఏర్పాటు చేసి ప్రజలకు అధిక వడ్డీ ఆశచూపి మోసం చేసినట్లు తేలిందని సీఐ తెలిపారు. మొదట కొంతమందికి వడ్డీ చెల్లించి నమ్మకం కలిగించి, అనంతరం పెద్దఎత్తున పెట్టుబడులు సేకరించినట్లు నిందితులు అంగీకరించారని పేర్కొన్నారు. ఈవిధంగా చందంపేట, పెద్దఅడిశర్లపల్లి, నేరేడుగొమ్ము, కొండమల్లేపల్లి తదితర మండలాలకు చెందిన అనేక మంది నుంచి సుమారు రూ.40 కోట్ల వరకు సేకరించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఇలా సేకరించిన డబ్బులతో భూములు కొనుగోలు చేసి, ఆన్‌లైన్ ట్రేడింగ్ చేసి నష్టపోయినట్లు తమ విచారణలో తేలిందన్నారు. నిందితుల నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, ఒక పెన్‌డ్రైవ్, భూములకు సంబందించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. మరికొంత మంది నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసంప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.


