శాలిగౌరారం : రాత్రి సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్కకొండారం గ్రామ సమీపంలో 365 నంబర్ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగింది. మంగళవారం మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామానికి చెందిన మల్లెపాక స్వామి, సైదమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చాలా ఏళ్ల క్రితమే స్వామి మృతిచెందడంతో సైదమ్మే పిల్లలను పెంచి పెద్దచేసింది. పెద్ద కుమారుడికి, కుమార్తెకు వివాహాలు చేసింది. చిన్న కుమారుడు శ్రీకాంత్(29)కు వివాహం కాలేదు. శ్రీకాంత్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన శ్రీకాంత్ తిరిగి రాలేదు. అయితే మంగళవారం తెల్లవారుజామున పెర్కకొండారం గ్రామ సమీపంలో 365వ నంబర్ జాతీయ రహదారిపై శ్రీకాంత్ రక్తపుమడుగులో పడి ఉండటం గమనించిన స్థానిక రైతులు దగ్గరకు వెళ్లి చూడగా అప్పటికే అతడు మృతిచెందాడు. వెంటనే విషయాన్ని వంగమర్తి గ్రామస్తులకు చెప్పి పోలీసులకు కూడా సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీ లించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సీఐ హరిబాబు నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా.. తన కుమారుడికి పెర్కకొండారం గ్రామానికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం ఉందని, ఆమె తన కుమారుడిని రాత్రి సమయంలో పిలిపించి హత్యకు పాల్పడిందని మృతుడి తల్లి సైదమ్మ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సైదులు తెలిపారు.
శరీరంపై దెబ్బలు.. తలపై నరికిన ఆనవాళ్లు
శ్రీకాంత్ శరీరంపై బలంగా కొట్టిన దెబ్బలు ఉండడంతో పాటు తల వెనుక భాగంలో రెండు చోట్ల పదునైన ఆయుధంతో నరికిన గాయాలు ఉన్నాయి. దీంతో శ్రీకాంత్‌ను హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు భావిస్తున్నారు.
పోలీసుల అదుపులో వివాహిత..?
శ్రీకాంత్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెర్కకొండారం గ్రామానికి చెందిన వివాహితను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. మృతుడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.
వివాహేతర సంబంధమే కారణమంటున్న మృతుడి కుటుంబ సభ్యులు
శాలిగౌరారం మండలం
పెర్కకొండారం సమీపంలో ఘటన


