యాదగిరీశుడికి బ్రహ్మోత్సవ శోభ
యాదగిరిగుట్ట : అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా.. ఏకశిఖరవాసుడిగా.. పంచనారసింహుడిగా.. స్తంభోద్భవుడిగా.. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా విరాజిల్లుతున్న యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫాల్గుణ శుద్ధ పాడ్యమి బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 28వ తేదీన ఫాల్గుణ శుద్ధ ద్వాదశి శనివారం రోజున శృంగార డోలోత్సవంతో ముగియనున్నాయి. 11 రోజుల పాటు నవాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమ సిద్ధాంతానుసారం, సంప్రదాయ రీతిలో ప్రధానాలయం ఉద్ఘాటన జరిగిన తరువాత బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయానికి తాత్కాలికంగా విద్యుత్ దీపాలు, అరటి, మామిడి తోరణాలు, పూలతో ముస్తాబు చేశారు. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో 100 మంది పారాయణీకులు, రుత్వికులు, ఆచార్యులు పాల్గొననున్నారు.
విష్వక్సేన ఆరాధనతో..
యాదగిరీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం 10గంటలకు శ్రీవిశ్వక్సేనారాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో ప్రారంభమై, ఈ నెల 28వ తేదీన ఉదయం శతఘటాభిషేకం, రాత్రి 9గంటలకు శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవంతో సమాప్తం అవుతాయి. 24న శ్రీస్వామి ఎదుర్కోలు ఉత్సవం , 25న తిరు కల్యాణోత్సవం, 26న దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి అలంకార సేవలు, వాహన సేవలకు అర్చకులు శ్రీకారం చుట్టనున్నారు.
ఉత్తర మాఢవీధిలో కల్యాణం..
శ్రీస్వామి వారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్రధానాలయ ఉత్తర మాడవీధిలో తిరు కల్యాణ వేడుక నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు రూ.3,000 చెల్లించి శ్రీస్వామి వారి ఆశీస్సులు పొందాలని వారు కోరుతున్నారు. ఈ కల్యాణోత్సవంలో 10వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పట్టణంలో తాత్కాలిక స్వాగత తోరణాలు, విద్యుత్ దీపాలతో కూడిన స్వాగత తోరణాలను సిద్ధం చేశారు. కొండ పైన ఉత్తర మాడ వీధిలో యాగశాలను సిద్ధం చేశారు. ఆలయ ముఖ మండపంతో పాటు ప్రధానాలయం చుట్టూ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రథమ ప్రాకారంలో సేవల అలంకరణలు
శ్రీస్వామి వారి ఉత్సవాల్లో ప్రధానమైనవి అలంకార, వాహన సేవలు. ప్రథమ ప్రాకారంలోని మండపంలో స్వామివారి అలంకార, వాహనసేవలను ముస్తాబు చేసిఉత్తర రాజగోపురం నుంచి మాడవీధుల్లో ఊరేగిస్తారు. తూర్పు రాజగోపురం ముందు ఏర్పాటు చేసే వేదిక వద్ద శ్రీస్వామి వారి అలంకార సేవను అధిష్టించి అర్చకులు, పారాయణీకులు, రుత్వికులు పారాయణం చేస్తారు.
బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకొని ఆలయంలో భక్తులచే నిర్వహించే వివిధ ఆర్జిత సేవలను నిలిపివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే బుధవారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు ఆలయంలో నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు సేవలు రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే పేర్కొన్నారు. 24 నుంచి 26 వరకు భక్తులచే సాయంత్రం నిర్వహించే సహస్రనామార్చనలు, భోగములు రద్దు చేశారు. 27న నిర్వహించే లక్ష పుష్పార్చన పూజలను సైతం నిలిపివేస్తారు. 27 నుంచి 28వ తేదీ వరకు భక్తులచే జరిపించే అభిషేకం, అర్చనలు రద్దు చేశారు. ఇక శ్రీస్వామి వారి తిరు కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు రూ.3వేలు చెల్లించి సంప్రదాయ దుస్తులతో కల్యాణోత్సవంలో పాల్గొనాలని ఆలయాధికారులు వెల్లడించారు.
సేవలకు సిద్ధమైన బంగారు వాహనాలు
ముస్తాబైన యాదగిరిగుట్ట వీధులు
నేటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు
ఫ విష్వక్సేన ఆరాధనతో శ్రీకారం చుట్టనున్న అర్చకులు
ఫ 24న ఎదుర్కోలు, 25 తిరుకల్యాణం
ఫ 28న శృంగార డోలోత్సవంతో ముగింపు
ఫ ఏర్పాట్లు పూర్తిచేసిన ఆలయ అధికారులు
యాదగిరీశుడికి బ్రహ్మోత్సవ శోభ
యాదగిరీశుడికి బ్రహ్మోత్సవ శోభ


