హస్తం.. గెలుపు వ్యూహం | - | Sakshi
Sakshi News home page

హస్తం.. గెలుపు వ్యూహం

Jan 31 2026 10:50 AM | Updated on Jan 31 2026 10:50 AM

హస్తం.. గెలుపు వ్యూహం

హస్తం.. గెలుపు వ్యూహం

ఆశావహుల్లో ఉత్కంఠ

సూర్యాపేట : మున్సిపల్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్‌ సన్నద్ధమవుతోంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లోనూ పాగా వేసేందుకు వ్యూహాల్లో తలమునకలైంది. అందులో భాగంగా అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది. అధికార పార్టీ కావడంతో సులువుగా గెలుపొందవచ్చనే కాంక్షతో ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. అందుకే ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ).. వడపోతకు తెరతీసింది. సర్వేల నివేదికల ఆధారంగా బీఫాం ఇవ్వనుంది.

మూడు బృందాలతో..

సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీలకు ఈనెల 11న ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల ఎంపికలో సర్వేలే కీలకం కానున్నాయి. అధికార కాంగ్రెస్‌ పార్టీ తరఫున మూడు ప్రైవేట్‌ సంస్థలు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే రెండు సర్వే బృందాల నివేదికలు వచ్చినట్లు సమాచారం. ఇవే కాకుండా పార్టీ అంతర్గతంగా మరో సర్వే, ఇంటెలిజెన్స్‌ సర్వేలు చేయిస్తోంది. వీటి ఆధారంగా గెలిచే అవకాశం ఉన్నవారికే పార్టీ బీఫాం ఇవ్వనున్నారు.

జనంతో మమేకమై..

సర్వే బృందాలకు కేటాయించిన వార్డుల్లోని జనంతో ఈ బృందాలు మమేకమవుతున్నాయి. ముందే రూపొందించుకున్న ప్రశ్నావళి ఆధారంగా ఆశావహుల గురించి వాకబు చేస్తున్నాయి. అభ్యర్థి తెలుసా.. అంటూ మొదలు పెట్టి నేపథ్యం, పార్టీకి విధేయులుగా ఉంటారా ? ప్రజల్లో తిరుగుతున్నారా.. లేదా? సేవాదృక్పథం, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే గుణం ఉందా? గెలిస్తే స్థానిక ఎమ్మెల్యే, మంత్రుల దృష్టికి ప్రజాసమస్యలు తీసుకెళ్లి నిధులు రప్పిస్తారా? సభకు జనాన్ని తరలించే సామర్థ్యాలు ఉన్నాయా? స్వలాభం, ధనార్జన కోసం పనిచేస్తారా.. జనం కోసం సమయం కేటాయిస్తారా?. ఆర్థిక పరిస్థితులేంటి? తదితర వివరాలను సర్వే సంస్థలు అడిగి తెలుసుకుంటున్నాయి.

బీఫాం ఇచ్చేందుకు సమయం ఉండడంతో..

టికెట్‌ ఆశిస్తున్న వారిలో పార్టీకి విధేయులే కాకుండా ఆర్థికంగా బలంగా ఉన్నారా.. లేరా? అన్న విషయాన్ని సర్వేలో సేకరిస్తున్నారు. ఎక్కువ మందిపై సానుకూలత వ్యక్తమవుతున్నట్లు సమాచారం. కొందరు ఆర్థికంగా స్థితిమంతులైనా పార్టీకి సమయం కేటాయించడం, తదితర కారణాలతో సర్వేలో వ్యతిరేకత వస్తున్నట్లు తెలిసింది. మున్సిపల్‌ ఎన్నికలు పంచాయతీ ఎన్నికల మాదిరిగా కాకుండా పార్టీలే అభ్యర్థులను నిలబెడతాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు కచ్చితంగా బీఫాం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఏ అభ్యర్థికై తే బీఫాం వస్తుందో ఆ అభ్యర్థికే పార్టీ గుర్తును ఎన్నికల అధికారులు కేటాయించనున్నారు. ఈ క్రమంలో ఆశావహులు నామినేషన్లు దాఖలు చేసినా.. ఈనెల 3వ తేదీ వరకు బీఫాం ఇచ్చేందుకు అవకాశం ఉండడంతో పార్టీ ఆచితూచి గెలుపు గుర్రాలకే టికెట్‌ ఇవ్వాలని చూస్తోంది. మంచి అభ్యర్థులను ఎంపిక చేస్తే రేసులో ప్రతిపక్షాల కంటే ముందుంటామని, గెలుపు సునాయాసం అవుతుందన్న ధీమాతో అధికార పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.

ఫ ఐదు మున్సిపాలిటీల్లో విజయమేలక్ష్యంగా ప్రణాళికలు

ఫ మూడు బృందాలతో క్షేత్రస్థాయిలో సర్వే

ఫ నివేదిక ఆధారంగా అభ్యర్థులకు బీఫాం

కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశిస్తున్న ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నామినేషన్‌ గడువు శుక్రవారంతో ముగియగా ఇంకా అన్ని చోట్లా అభ్యర్థులను ఖరారు చేయలేదు. పార్టీ అభ్యర్థిత్వం ఖరారు కానప్పటికీ పలువురు నామినేషన్‌ వేశారు. కొన్ని వార్డుల నుంచి ఇద్దరుముగ్గురు నామినేషన్‌ దాఖలు చేశారు. సర్వే నివేదికల ఆధారంగానే అభ్యర్థులకు బీఫాం ఇచ్చే అవకాశం ఉండటంతో ఉండటంతో టికెట్‌ వస్తుందా లేదోనని వారిలో టెన్షన్‌ నెలకొంది. నామినేషన్‌ వేసిన అభ్యర్థుల్లో పలువురు టికెట్‌ తమకే వస్తుందన్న ధీమాతో ఇప్పటికే పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. టికెట్‌ రాకపోతే తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళనలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement