మున్సిపల్ ఖజానా కళకళ
సూర్యాపేటటౌన్ : ఎన్నికల వేళ మున్సిపాలిటీల ఖజానా ఒక్కసారిగా కళకళలాడుతోంది. ఏళ్ల తరబడి అధికారులు నోటీసులిచ్చినా, జరిమానాలు విధించినా ససేమిరా అన్న బకాయిదారులు.. ఇప్పుడు నామినేషన్ల కోసం క్యూ కట్టి పన్నులు చెల్లించారు. జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీలు ఉండగా మూడు రోజుల్లో నల్లా, ఆస్తి పన్ను రూపంలో రూ.37.75లక్షల ఆదాయం సమకూరింది.
నో డ్యూస్ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో..
మున్సిపల్ ఎన్నికల బరిలో నిలవాలంటే నల్లా, ఆస్తి పన్ను బకాయిలు ఉండరాదు. అభ్యర్థులు నామినేషన్ వేసే సమయంలో ఎన్నికల అధికారులకు తప్పనిసరిగా నోడ్యూస్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఒక్క రూపాయి బకాయి ఉన్నా నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వందలాది మంది అభ్యర్థులు ముందుకొచ్చి నల్లా బిల్లు, ఆస్తి పన్ను చెల్లించారు. అభ్యర్థులను ప్రతిపాదించే వారు సైతం వందల మంది ఉండటంతో మున్సిపాలిటీలకు భారీగా పన్నులు వసూలయ్యాయి. అధికారుల విజ్ఞప్తులకు లొంగని వారు కూడా ఎన్నికల నిబంధనలకు దారికొచ్చారు. ఈనెల 28న నామినేషన్ల ప్రక్రియ మొదలు కాగా 30వ తేదీన ముగిసింది. మూడు రోజుల పాటు మున్సిపల్ కార్యాలయాలు పన్ను చెల్లింపుదారులతో కిక్కిరిసిపోయాయి. పన్నుల వసూళ్లకు మున్సిపాలిటీ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.
● సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డులు ఉండగా రూ.23.50 లక్షలు వసూలయ్యాయి.
● కోదాడలో 35 వార్డుల్లో రూ.2.43,500
● హుజూర్‌నగర్‌లో 28 వార్డులకు గాను రూ.6.60 లక్షలు
● నేరేడుచర్లలో 15 వార్డులకు రూ. 2,30,482
● తిరుమలగిరిలో 15 వార్డులు ఉండగా రూ.2,69,260 వసూలయ్యాయి. మొత్తం ఐదు మున్సిపాలిటీలకు రూ.37.75 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఫ నల్లా బిల్లు, ఆస్తి పన్ను రూపంలో భారీగా ఆదాయం
ఫ మూడు రోజుల్లో రూ.37.75 లక్షలు
ఫ ఏళ్ల తరబడి పేరుకుపోయినబకాయిలు సైతం వసూలు


