పేట వాసికి గద్దర్ స్ఫూర్తి పురస్కారం
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట పట్టణానికి చెందిన తెలంగాణ దళిత విద్యార్థి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కల్లేపల్లి నరేష్‌కు గద్దర్ స్ఫూర్తి పురస్కారం లభించింది. గద్దర్ జయంతిని పురస్కరించుకొని నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం నందమూరి తారకరామారావు కళామందిరంలో గురువారం రాత్రి ఫాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్, ఇండో కెనెడియన్ యూత్ కౌన్సిల్, పుడమి సాహితీ వేదిక సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన గద్దర్ జయంతి వేడుకలు నిర్వహించారు. మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి, వెన్నెల గద్దర్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందించారు. అద్దంకి రాజా యోనా ఆధ్వర్యంలో, పుడమి సాహితీ వేదిక చైర్మన్ చిలుముల బాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వేణుగోపాలచారి, పురస్కారాల ప్రధాత, గద్దర్ కుమార్తె వెన్నెల గద్దర్, ఇండో కెనెడియన్ యూత్ కౌన్సిల్ వ్యవస్థాపకులు రొయ్యూరు శేష సాయి, టీటీడీ బోర్డు పూర్వ సభ్యులు ధరావత్ బాల్ సన్ నాయక్, పారిశ్రామిక వేత్త డాక్టర్ యామినేని ఉప్పల్ రావు, సామాజికవేత్త గొల్లమందల దానయ్య తదితరులు పాల్గొన్నారు.


