బీఆర్‌ఎస్ హయాంలోనే కోదాడ అభివృద్ధి
కోదాడ: బీఆర్‌ఎస్ హయాంలోనే కోదాడ పట్టణం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం క్రాస్ రోడ్డు నుంచి రామిరెడ్డి పాలెం వరకు 8 వార్డుల మీదుగా ఉన్న 33 కేవీ లైన్‌ను తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మార్పించానని, పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశానని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు మీ ఓట్లతో గెలిచి హైదరాబాద్‌లో సేదదీరుతారని, తాను మాత్రం ఎల్లప్పుడూ ప్రజల మధ్యే ఉంటా నన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన మాదిరిగా కోదాడ పట్టణం అభివృద్ధి సాధించాలంటే త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రజలంతా కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో బీఆర్‌ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్‌కే నయీం, పి.సత్యబాబు, 12వ వార్డు ఇంచార్జ్ గొర్రె రాజేష్, సంగిశెట్టి గోపాల్, సంపెట ఉపేందర్, కర్ల సుందర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్


