పల్లెపోరుకు పటిష్ట భద్రత
విజయోత్సవాలకు అనుమతి లేదు..
ఇప్పటికే 549 మంది బైండోవర్
సూర్యాపేట టౌన్ : ‘జిల్లాలో ఈ నెల 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి గ్రామంపై పోలీస్ నిరంతరం నిఘా ఉంటుంది’ అని జిల్లా ఎస్పీ కె.నరసింహ వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లపై శుక్రవారం ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు వివరాలు వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగే ప్రజలంతా సహరించాలని, ఘర్షణలకు పాల్పడితే కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. పలు వివరాలు ఆయన మాటాల్లోనే..
173 సమస్యాత్మక గ్రామాల గుర్తింపు
జిల్లాలో మొత్తం 486 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా ఇందులో మొదటి విడత 159 గ్రామాలకు గాను 47 సమస్యాత్మక గ్రామాలుగా, రెండవ విడతలో 181 గ్రామాలకు 65, మూడవ విడతలో 146 గ్రామాలకు 58 గ్రామాలు సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించాం. ఆయా గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ సిబ్బంది నిత్యం తిరుగుతూ ప్రజలకు ఎన్నికల నియమాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా సమస్యలు సృష్టిస్తే భవిష్యత్తులో ఇబ్బంది ఎదుర్కొంటారని వివరిస్తున్నాం. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి.
ఐదంచెల భద్రత..
జిల్లాలోని 23 మండలాల్లో మూడు విడతల్లో జరగనున్న ఎన్నికలకు ప్రతి విడతకు 1,500 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. అందులో గ్రామ పంచాయతీలో భద్రత, రెండు మూడు గ్రామ పంచాయతీల పరిధిలో ఒక ఎస్‌ఐ లెవల్ అధికారి రూట్ మొబైల్స్, మండలానికి సీఐ, డీఎస్పీ ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్, ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ ట్రైకింగ్ ఫోర్స్ పనిచేస్తుంది. పోలింగ్ కేంద్రాలను ఇద్దరు ఏఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 55 మంది ఎస్‌ఐలు నిరంతరం పర్యవేక్షిస్తారు.
97 కేసులు నమోదు
జిల్లాలో నిరంతర తనిఖీలు చేస్తున్నాం. ఇప్పటి వరకు 97 కేసులు నమోదు చేశాం. అలాగే ఎన్నికల సామగ్రిని తరలించేందుకు మొదటి విడత రూట్ మొబైల్స్ 58, రెండవ విడతకు 47, మూడవ విడత రూట్ మొబైల్స్ 45 ఏర్పాటు చేశాం. నిరంతర పర్యవేక్షణకు నాలుగు ఎస్‌ఎస్ టీంలు, 23 ఎంసీసీ టీంలు, 23 ఎఫ్‌ఎస్‌టీలు, ఎనిమిది పోలీస్ స్పెషల్ స్టైకింగ్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశాం.
9వ తేదీ సాయంత్రం వరకే ప్రచారం
ఈ నెల 11వ తేదీన జరగనున్న తొలి విడత ఎన్నికలకు 9వ తేదీ సాయంత్రం వరకు గ్రామాల్లో అభ్యర్థుల ప్రచారం చేసుకోవచ్చు. ఆ తర్వాత అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం చేయకూడదు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ బహుమతులు, మద్యం, డబ్బు పంచకుండా నిఘా ఉంచాం. జిల్లాలోకి అక్రమంగా వస్తువులను రవాణా చేయకుండా జిల్లా సరిహద్దుల వెంట ఏడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం.
మూడు విడతల్లో పోలింగ్ అనంతరం మధ్యాహ్నం 2గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. గెలుపొందిన అభ్యర్థులు ఎవరూ కూడా విజయోత్సవాలు, బాణసంచాలు కాల్చేందుకు అనుమతి లేదు. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు సభ్యులకు అవగాహన సదస్సులు నిర్వహించాం. ఎన్నికల నియమ నిబంధనలకు సంబంధించి బుక్‌లెట్ సైతం ఇచ్చాం. ఎన్నికల నిబంధనలు ఎవరూ ఉల్లంఘించినా చర్యలు తప్పవు.
ఫ ప్రతి విడతకు 1,500 మందితో బందోబస్తు
ఫ సమస్యాత్మక గ్రామాలపై నిఘా
ఫ నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు
ఫ ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటెయ్యాలి
ఫ ఎన్నికలు ప్రశాంతంగా
జరిగేలా ప్రజలు సహకరించాలి
ఫ ఘర్షణలు సృష్టిస్తే
కేసులు నమోదు చేస్తాం
‘సాక్షి’తో ఎస్పీ కె.నరసింహ
గతంలో నేరాలకు పాల్పడిన వారిని, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వారిని గుర్తించి మళ్లీ ఎలాంటి నేరాలకు పాల్పడొద్దని, సమస్యలు సృష్టించమని రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు ముందస్తు పూచీకత్తుతో బైండోవర్ చేస్తున్నాం. అలాగే జిల్లాలో లైసెన్స్‌డ్ గన్‌లను కూడా డిపాజిట్ చేయిస్తున్నాం. ఇప్పటి వరకు జిల్లాలో 59 గన్‌లను ఆయా పోలీస్ స్టేషన్‌ల పరిధిలో డిపాజిట్ చేయించాం.
పల్లెపోరుకు పటిష్ట భద్రత


