చిత్ర విచిత్రాల పొత్తులు..!
పొత్తులతో చిన్నాభిన్నం
భానుపురి (సూర్యాపేట) : తొలి, మలి విడతల పల్లెపోరులో చిత్ర విచిత్రాల పొత్తులు తెరపైకి వచ్చాయి. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో కత్తులు దూసుకునే పార్టీలు సైతం పంచాయతీ పోరులో కలిసి ముందుకు సాగుతున్నాయి. గ్రామాన్ని బట్టి ఒక్కో పార్టీలో మూడు నాలుగు చీలికలు వచ్చి పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు పోటీకి సై అంటే సై అంటున్నారు. వార్డులు తగ్గినా.. ఉపసర్పంచ్ ఇవ్వకున్నా మరోవర్గాన్ని ఏర్పాటు చేసుకుని ప్రత్యర్థి పార్టీ బలపర్చిన అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారు. దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది.
గెలుపే లక్ష్యంగా..
గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై నిర్వహించరు. కేవలం అభ్యర్థిని చూసే ఆయా పార్టీలు బలపర్చి మద్దతు ఇస్తుంటాయి. అయితే పార్టీలు సైతం తమ పార్టీలో ఉన్న ముఖ్య కార్యకర్తలనే సర్పంచ్ అభ్యర్థులుగా నిలబెడుతున్నాయి. వార్డు సభ్యుల పరిస్థితీ ఇలాగే ఉంటుంది. ఈ క్రమంలో జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరగనున్న తుంగతుర్తి, నాగారం, మద్దిరాల, జాజిరెడ్డిగూడెం, తిరుమలగిరి, నూతనకల్, సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్) మండలాల్లోని 159 గ్రామపంచాయతీలు, 1,442 వార్డులతోపాటు రెండో విడత ఎన్నికలు జరిగే చిలుకూరు, కోదాడ, అనంతగిరి, మునగాల, నడిగూడెం, మోతె, చివ్వెంల, పెన్‌పహాడ్ మండల్లాలోని 181 గ్రామాలు, 1,628 వార్డుల్లో పార్టీలతో సంబంధం లేకుండా పొత్తులు కుదిరాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు పలుచోట్ల ఒకే అభ్యర్థిని బలపర్చడం గమనార్హం. కొన్నిచోట్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు.. ఇంకొన్నిచోట్ల బీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణులు ఇలా.. రాజకీయాలతో సంబంధం లేకుండా తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పొత్తులు పెట్టుకున్నాయి.
తొలి విడత పల్లెల్లో ఇలా..
● తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో కుంభం మంజులను కాంగ్రెస్ పార్టీ బలపరిచి బరిలో నిలిపింది. ఇదే గ్రామంలో జేఏసీలో ఉన్న కాంగ్రెస్ వర్గీయులు, బీఆర్‌ఎస్, ఇతర పార్టీలు కలిసి మాడిశెట్టి వేదవాణిని నిలబెట్టాయి.
● తుంగతుర్తి మండలం అన్నారంలో బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి పోటీచేశాయి. వెలుగుపల్లిలో బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి బరిలో నిలిచాయి.
● ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీలు పొత్తు పెట్టుకున్నాయి. ఏపూరులో బీఆర్‌ఎస్, సీపీఎం, బీజేపీ పొత్తు పెట్టుకోగా గట్టికల్లు గ్రామంలో బీజేపీ, బీఆర్‌ఎస్, సీపీఎం.. కందగట్ల, పాత సూర్యాపేట గ్రామాల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో ఉన్నాయి. తుమ్మల పెన్‌పహాడ్, ఇస్తాళ్లాపురం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మద్దతిస్తోంది.
● జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాలలో కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీమంత్రి దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే సామేలు ఇరు వర్గీయులు వేర్వేరుగా సర్పంచ్ బరిలో ఉన్నారు. దామోదర్‌రెడ్డి వర్గీయుల అభ్యర్థికి బీఆర్‌ఎస్ మద్దతు తెలిపింది. అలాగే జాజిరెడ్డిగూడెం, కుంచమర్తి, అడివెంల, తిమ్మాపురం, వేల్పుచర్ల, రామన్నగూడెం, కాసర్లపహాడ్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాల అభ్యర్థులు పోటీలో ఉన్నారు. జాజిరెడ్డిగూడెంలో ఎమ్మెల్యే సామేలు వర్గీయునికి సీపీఎం, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ మద్దతు తెలిపాయి.
కత్తులు దూసుకునే పార్టీలు సైతం మిత్రులుగా
ఫ పార్టీల్లో వర్గాలుగా చీలికలు
ఫ పంచాయతీ ఎన్నికల్లో వెలుగు
చూస్తున్న పొత్తుల చిత్రాలు
ఫ కలిసి ప్రచారం చేస్తుండడంతో ముక్కున వేలేసుకుంటున్న ఓటర్లు
పంచాయతీల్లో ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మంది తమ పార్టీ మద్దతుదారులు గెలిచేలా ప్రణాళికలు రూపొందించింది. బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐలు సైతం తమతమ పార్టీలు బలంగా ఉన్నచోట సత్తాచాటాలని భావిస్తూ పోటీలో నిలిచాయి. అయితే స్థానిక పరిస్థితుల్లో బలంగా లేని పార్టీలు సర్పంచ్ అభ్యర్థిగా తమ పార్టీ వ్యక్తిని బలపర్చి ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దని పొత్తులకు వెళ్లాయి. ఈ పొత్తుల కారణంగా పార్టీలో ఉన్న ముఖ్య నాయకుల మధ్య విభేదాలు వచ్చి ఎవరి దారివారు చూసుకునే పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షంలో మొదటినుంచి వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు నచ్చకపోవడం మరో పార్టీతో జతకట్టి ఎన్నికల బరిలో నిలిచారు. ఈ పొత్తులు ఇలా ఉండగా.. రెండు రోజులుగా ప్రచారాలకు వెళుతున్న నాయకులను చూసి ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు.


