ఎన్నికల సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేయండి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేయండి

Dec 8 2025 8:16 AM | Updated on Dec 8 2025 8:16 AM

ఎన్ని

ఎన్నికల సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేయండి

భానుపురి (సూర్యాపేట) : ఈనెల 11న మొదటి విడత ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులంతా ముందస్తుగానే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా విధిగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ ఒక ప్రకటనలో కోరారు. ఎన్నికల విధులు కేటాయించి ఉద్యోగులు ఈనెల 6 నుంచి 9వ తేదీ వరకు సూర్యాపేట, ఆత్మకూరు (ఎస్‌), జాజిరెడ్డిగూడెం, నాగారం, నూతనకల్‌, మద్దిరాల, తిరుమలగిరి, తుంగతుర్తి మండలాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్లలో విధిగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించిన ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

టీయూపీఎస్‌ జిల్లా

అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక

సూర్యాపేట టౌన్‌ : జిల్లా కేంద్రంలోని సరస్వతి విద్యా నిలయంలో ఆదివారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీయూపీఎస్‌) జిల్లా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిని ఎన్నుకున్నారు. ఆ సంఘం జిల్లా ప్రస్తుతం అధ్యక్షురాలు పర్వతం సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యనిర్వాహకవర్గ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా యామా రమేష్‌, ప్రధాన కార్యదర్శిగా జూలకంటి వెంకట్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు ఎన్నికల అధికారి లింగంపల్లి హరిప్రసాద్‌ ప్రకటించారు. ఈ సమావేశానికి రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ నల్లగొండ విభాగ్‌ భౌద్దిక్‌ ప్రముఖ్‌ బంటు జనార్దన్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు నైతిక విలువలు నేర్పాలన్నారు. ఈ సమావేశంలో బెల్లంకొండ రామమూర్తి, బ్రహ్మచారి, రామారావు, శ్రీనివాసరావు, సుధాకర్‌రావు, నాగేశ్వర్‌రావు, జితేందర్‌రెడ్డి, కోటిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌, పూల్‌సింగ్‌, శ్రీనివాస్‌, శ్రీదేవి, రజని, ధనేశ్వర్‌రావు, శ్రీనివాసరావు, ఆంజనేయులు, ఉపేందర్‌ పాల్గొన్నారు.

మట్టపల్లిలో నిత్యకల్యాణం

మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఎదుర్కోలు మహోత్సవం, కల్యాణం చేపట్టి శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను గరుడ వాహనంపై ఉంచి ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. మహానివేదనతో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈఓ జ్యోతి, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.

సూర్యక్షేత్రంలో

ప్రత్యేక పూజలు

అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని చాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. అలాగే క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్‌, శ్రీరామకోటి స్థూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. స్వామి క్షేత్రానికి తరలివచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్‌, గణపురం నరేష్‌, ఇంద్రారెడ్డి, యాదగిరి, అర్చకులు భీంపాండే, అంకిత్‌పాండే, శ్రీరాంపాండే, భక్తులు పాల్గొన్నారు.

ఎన్నికల సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేయండి1
1/1

ఎన్నికల సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement