రూ.కోటైనా.. పోటీకి సై!
అత్యధిక ఓటర్లు ఉన్న గ్రామాల్లో ఖర్చు కూడా ఎక్కువే..
రెండో విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో అభ్యర్థుల నామినేషన్‌ల పరిశీలన పూర్తికావడంతో బరిలో ఉన్న రెబల్స్‌ను తప్పించడానికి భారీ ఎత్తున బేరసారాలు సాగుతున్నాయి. ఎన్నికలకు పెట్టిన ఖర్చు మొత్తం ఇస్తామని, బరిలోనుంచి తప్పుకుని ఏకగ్రీవానికి సహకరించాలని కొందరు పోటీదారులను బతిమిలాడుతున్నారు. చివరి నిమిషం వరకు పోటీలో ఉంటే కలిసి వస్తుందని, అప్పటివరకు వేచి చూడాలని కొందరు భావిస్తున్నారు. తాము గెలవలేకపోయినా ఓడించడానికి పనికివస్తానని కొందరు ప్రత్యర్థులను భయపెడుతూ ధర పెంచుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
కోదాడ: జిల్లా పరిధిలో అత్యధిక ఓటర్లు కలిగిన పది గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి. ఆయా గ్రామాల్లో రిజర్వేషన్లతో సంబంధం లేకుండా, ఖర్చుకు వెనుకాడకుండా ఆశావహులు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు. ఒక్కొక్కరు కోటి రూపాయలకు మించి ఖర్చు చేయడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలో అత్యధిక సిమెంట్ ఫ్యాక్టరీలు కలిగిన మేళ్లచెరువు, దొండపాడు గ్రామాల్లో రూ.కోటిన్నర వరకు ఖర్చు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓటర్లు అధికంగా ఉన్న గ్రామాలను పరిశీలిస్తే.. మేళ్లచెరువు (10,567), దొండపాడు (6,737), బేతవోలు (6,468), మఠంపల్లి (6,317), చిలుకూరు (6,041), తుంగతుర్తి (5,338), పొనుగోడు (5,161), రామాపురం (4,797), నూతన్‌కల్ (4,568), మునగాల పంచాయతీలు ఉన్నాయి. ఈ పది గ్రామాల్లో 7 గ్రామాలు హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లోనే ఉన్నాయి
అప్పు చేసైనా సరే..
కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టులో ఉండడంతో ఇక్కడ భూములకు ఎక్కువ ధరలున్నాయి. పెద్ద గ్రామాల్లో పోటీ చేస్తున్నవారు అవసరమైతే నాలుగు ఎకరాలైన అమ్ముతామని, అప్పు తెచ్చయినా సరే ఖర్చు పెడతామని చెబుతుండడంతో తీవ్ర ఆసక్తి నెలకొంది. చిలుకూరు మండలం బేతవోలు పంచాయతీలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలు సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. ఇద్దరు రూ.కోటిన్నర వరకు ఖర్చు చేయడానికి సిద్ధపడే ఈ ఎన్నికల బరిలోకి దిగుతున్నారని గ్రామస్తులు అంటున్నారు. ఇక మునగాల గ్రామపంచాయతీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కోదాడ మండలం గుడిబండ, నల్లబండగూడెం, గణపవరం పంచాయతీల్లో కూడా ఖర్చు రూ.కోటి పైమాటేనని పలువురు అంటున్నారు.
విచ్చలవిడిగా మద్యం..
పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారైనప్పటి నుంచి ఆశావహులు మద్యానికి విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. కోదాడ మండల పరిధిలోని ఓ గ్రామంలో సోమవారం నామినేషన్ వేయడానికి వెళ్తున్న సందర్భంగా మద్యానికి రూ.లక్ష ఖర్చు చేసినట్లు అభ్యర్థి ఒకరు చెప్పారు. ఎన్నికల బరిలో ఉండేవారు మద్యం కోసం అప్పుడే కొత్త దుకాణదారులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. పెద్ద గ్రామాల్లో రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు మద్యానికి ఖర్చు చేయాల్సిందేనని, ఆశావహులు అందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.


